మలేసియా ఎయిర్‌లైన్స్ సైట్‌పై హ్యాకర్ల దాడి!

హాంగ్‌కాంగ్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదుల మద్దతుదారులు, మలేసియా ఎయిర్‌లైన్స్ అధికారుల మధ్య సోమవారం సైబర్ పోరు హోరాహోరీగా కొనసాగింది. మలేసియా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లోకి హ్యాకర్లు చొరబడటంతో తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 404 విమానం అదృశ్యమైందని, సైబర్ కాలిఫేట్ హ్యాకింగ్ చేసినట్లు వెబ్‌సైట్‌లో సందేశాన్ని ఉంచటంతో కలకలం రేగింది.

విమానయాన సంస్థ సర్వర్ల నుంచి సేకరించిన డేటాను నాశనం చేస్తామని హ్యాకర్లు హెచ్చరించారు. ‘లిజర్డ్ స్క్వాడ్’ అనే సంస్థ దీన్ని తమ పనిగా ట్విట్టర్‌లో పేర్కొంది. తలకు టోపీ, కోట్ ధరించిన ఓ బల్లి బొమ్మను హ్యాకర్లు వెబ్‌సైట్‌లో ఉంచారు. తమ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురి కాలేదని, ఇంటర్నెట్ డొమైన్‌లోకి హ్యాకర్లు చొరబడి వినియోగదారులను దారి మళ్లిస్తున్నట్లు మలేషియా విమానయాన సంస్థ తెలిపింది.