మల్లన్నసాగర్ బంద్ విజయవంతం
– కోదండరాంతో సహా పలువురి అరెస్టు
– ప్రభుత్వ తీరుపై నిరసన
మెదక్,జులై 25(జనంసాక్షి): మల్లన్నసాగర్ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం పిలుపుమేరకు మెదక్ జిల్లా బంద్ ప్రశాంతంగా సాగింది. జనజీవనంపై బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. ఇకపోతే మల్లన్న సాగర్ రైతులకుమద్దతు ప్రకటించి వారిని కలవాలని ప్రయత్నించిన పొలిటికల్ జెఎసి ఛైర్మన్ కోదండరామ్, ఆయన బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గజ్వెల్‌కు రాకముందే వంటిమామిడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని ఐడిఎ బొల్లారం తరలించారు. అక్కడి కి రావడానికి ప్రయత్నించిన టిడిపి నేత రేవంత్‌నుకూడా అడ్డుకున్నారు. ఇకపోతే బంద్ కారణంగా చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బంద్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయా గ్రామాలు పట్టణాల్లో ర్యాలీలు చేపట్టారు. ఉదయాన్నే కాంగ్రెస్, టిడిపి, భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిర్వాసితులపై జరిగిన దాడిని నిరసిస్తూ మెదక్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై గుమ్మడిదల వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై దమనకాండ నిర్వహిస్తుందని నాయకులు అశోక్, బాల్‌రెడ్డి తదితరులు ఆరోపించారు. రాస్తారోకోతో రహదారిపై ఇరువైపులా రెండున్నర కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు బయలుదేరిన తెలంగాణ ఐకాస బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ బయలుదేరిన కోదండరామ్ సహా ఐకాస నేతలను మెదక్ ములుగు మండలం ఒంటిమామిడి వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని ఐడీఏ బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని గజ్వేల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులపై ఆదివారం జరిగిన లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌లో భాగంగా మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి రేవంత్‌తో పాటు పదిమంది టీడీపీ నేతలు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో తుర్కపల్లి వద్దే అన్ని పక్షాలు, ప్రజాసంఘాలకు చెందిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి పోలీసుల కన్నుగప్పి కాన్వాయ్ నుంచి దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అనంతరం తన కారులో గజ్వేల్ వరకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రేవంత్‌తో పాటు బీజేపీ స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహను అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సమయంలో టీడీపీ, ఇతర పక్షాలకు చెందిన కార్యకర్తలు-పోలీసులకు మధ్య కొద్దిసేపుట తోపులాట జరిగింది. తుర్కపల్లి వద్దే నాయకులు అరెస్ట్ అయినప్పటికీ రేవంత్ చాకచక్యంగా వ్యవహరించి గజ్వేల్ వరకు చేరుకున్నారు. లాఠీచార్జ్‌లో గాయపడి గజ్వేల్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, మిగిలిన గ్రామాల్లో పర్యటించాలని భావించినప్పటికీ పోలీసులు మధ్యలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా రేవంతం మాట్లాడుతూ రైతులను ముంచి ప్రాజెక్ట్ కట్టాలనుకోవడం దారుణమన్నారు. కావాలనే వారిని బెదిరించి లాఠీఛార్జ్ చేశారని అన్నారు. తెలంగాణలో రైతులపై చూపే ప్రేమ ఇదేనా అని అన్నారు. న్యాయం కోసం ధర్నాకు దిగిన రైతులపై పోలీసుల దాడి అమానుషం అని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి మండిపడ్డారు. రిజర్వాయర్ అవసరంలేదని నిపుణులు చెబుతున్నా…ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముంపు గ్రామాల ప్రజలు నిన్న ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సుమారు 60 మందికి గాయాలయ్యాయి. ఇకపోతే మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా సంగారెడ్డి బస్ డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జగ్గారెడ్డి సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీ, ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారెడ్డి, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు బట్టు దయానందరెడ్డి పిలుపునిచ్చారు. నిర్వాసితుల పక్షాన వారికి న్యాయం జరిగే వారకు పోరాటాన్ని ఆపబోమన్నారు.. ప్రతిపక్షపార్టీలు ఇచ్చిన జిల్లా బంద్‌కు తామూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి తెలిపారు.
మల్లన్నసాగర్ లో రైతులపై లాఠీ చార్జీ చేయడాన్ని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని ఆయన హెచ్చరించారు.నిర్వాసితులపై లాఠీచార్జీ చేసిన కెసిఆర్ ప్రబుత్వానికి పోయేకాలం వచ్చిందని ఆయన మండిపడ్డారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనవసరమని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నా వినకుండా కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, భూ సేకరణకు సిద్దపడని వారిని బెదిరిస్తున్నారని టిఆర్‌ఎస్ ఈ విధానాలను మార్చుకోవాలని,లేకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని వీరభద్రం హెచ్చరించారు. మల్లన్నసాగర్‌లో తమ గ్రామాలు ముంపునకు గురికావద్దని ఆందోళన చేపట్టిన ప్రజలపై పోలీసులు పెద్దఎత్తున విరుచుకుపడిన సంఘటన ఆదివారం కొండపాక, తొగుట మండలాల్లోని ఎర్రవల్లి, పల్లెపహాడ్ గ్రామాల శివారుల్లో చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆందోళన కొనసాగింది. ముందుగా తొగుట మండలం పల్లెపహాడ్‌లో గ్రామస్థులంతా కలిసి తమ గ్రామాన్ని ముంపునకు గురిచేయవద్దని కోరుతూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేయడానికి వేములఘాట్ ప్రజలతో కలిసి రావడానికి సిద్ధమయ్యారు. పిల్లలు, పెద్దలు అంతా కలిసి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఎర్రవల్లి, పల్లెపహాడ్ గ్రామాల మధ్య డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఇష్టారీతిన మహిళలు, రైతులపై దాడులు చేయడంతో కొందరు యువకులు కిరోసిన్ పోసుకున్నారు. ఈ పెనుగులాటలో పోలీసులపై కూడా కిరోసిన్ పడింది. అక్కడ అదుపుతప్పిన పరిస్థితుల్లో లాఠీఛార్జి చేసి మరోమారు అందరిని తరిమారు. వారంతా పొలాల వెంట పరుగెత్తి ఎర్రవల్లి చేరుకున్నారు. తిరగబడ్డ ప్రజలు రాళ్లు, కర్రలు, ఇటుకలు విసిరి పోలీసులను తరిమారు. ఈలోగా పోలీసులు లాఠీఛార్జి చేస్తూ గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అదుపు తప్పడంతో టియర్ గ్యాస్ కూడా వదిలారు. సుమారు 50 మంది మహిళలు లాఠీఛార్జిలో గాయపడ్డారు. వేములఘాట్‌కు చెందిన అండమ్మ, జ్యోతి, మేఘమాల, ఆమె కుమారుడు రాజు, రాజయ్య, నగేశ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు 108 అంబులెన్సులో ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డిపై రాళ్లు విసరడంతో గాయాలయ్యాయి. కానిస్టేబుల్ రమేశ్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. మహిళా కానిస్టేబుళ్లు సైతం గాయపడ్డారు.
నిర్వాసితులపై లాఠీఛార్జి అమానుషం :కోదండరామ్
మల్లన్నసాగర్ ముంపు బాధితులపై లాఠీఛార్జి అమానుషమని తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ముంపు గ్రామాల్లో పోలీసులను మోహరించడం సమంజసం కాదని.. తక్షణమే పోలీసులు ఆయా గ్రామాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. లాఠీఛార్జి బాదితులను పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం దారుణమని.. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని కోదండరామ్ హితవు పలికారు. తమ భయాలను, ఆందోళనలను తెయిచేస్తున్న వారిపై లాఠీఛార్జీజరపడం దారుణమన్నారు. ఇది పూర్తిగా పోలీసుల దారుణ చర్యకు నిదర్శనమన్నారు. తెలంగాణలొ ఇలాంటి ఘటనలు కోరుకోలేదన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘మనది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. ఇక్కడ దౌర్జన్య పాలనను సహించం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేని ప్రాజెక్టు కోసం బలవంతంగా భూసేకరణ చేయడమే కాకుండా రైతులపై లాఠీచార్జి చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై ఉద్యమిస్తున్న వారిని ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు.దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు ప్రజల అవసరానికి ఉపయోగపడాలి తప్ప.. ప్రభుత్వాలకు కాదన్నారు. ఇక్కడ ప్రయోజనాలు ప్రజలన్నది గమనించాలన్నారు. ప్రాజెక్టు కట్టి తీరుతామని రైతుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సాదాబైనామాలతో రైతులను బెదిరిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అన్యాయం అన్నారు. రైతులతో చర్చిస్తేనే మల్లన్నసాగర్ భూ సేకరణ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రభుత్వాలు అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్టు చెబుతున్నా.. ఆచరణలో విఫలం అవుతున్నాయన్నారు. ఎస్సీల వర్గీకరణ అమలు కావాలని కోరుతున్నామన్నారు.మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధిత రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషం అని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జి చేశారని పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్వాసితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనవసరమని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నా వినకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాగా, సోమవారం తలపెట్టిన మెదక్ జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్ తెలిపారు.
మల్లన్న సాగర్ లాఠీఛార్జీపై సర్వత్రా నిరసన
మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్‌కు నిరసనగా తెలంగాణలోని పలు జిల్లాలో అఖిలపక్షం ఆందోళనకు దిగింది. ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. మరోవైపు ముంపు బాధితులపై పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా అఖిలపక్షం ఇచ్చిన మెదక్ జిల్లా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్‌కు నిరసనగా సీపీఎం ఆందోళనకు దిగింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కెసిఆర్ తీరుకు నిరసనగా నిరసన ర్యాలీలు చేపట్టారు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ పలుచోట్ల ప్రదర్శనలకు దిగారు. నిజామాబాద్ లో మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్‌కు నిరసనగా కాంగ్రెస్, సీపీఐ ధర్నా చేపట్టింది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్‌లో ఆందోళనకు దిగిన సీపీఎం నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్గొండ జిల్లా గా శాలిగౌరారం మండలంలో బంద్ నిర్వహించారు. మోత్కూర్‌లో ధర్నాకు సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ధర్నా మహబూబ్‌నగర్‌లో లాఠీచార్జ్‌కి నిరసనగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ రాస్తారోకో నిర్వహించారు. రామాయంపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని పలువురి అరెస్ట్ చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్ డిపో ఎదుట బస్సులను కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. సిద్దిపేటలో విపక్ష నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. దుకాణాలను, సినిమా హాళ్లను, పెట్రోల్‌బంక్‌లను మూయించారు. అయితే వీటిని టీఆర్‌ఎస్ నేతలు తిరిగి తెరిపించడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అటు బంద్ నేపథ్యంలో ఆర్టీసీ డిపో ఎదుట పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.




