మల్లన్న సాగర్‌పై కెసిఆర్ విజయం
వేములఘాట్ ప్రజల అంగీకారంతో తొలగిన అడ్డంకులు
ఇక మరింత వేగంగా ప్రాజెక్ట్ నిర్మాణం
సిద్దిపేట,జనవరి28(జనంసాక్షి): మల్లన్న సాగర్ విషయంలో సిఎం కెసిఆర్ మరో విజయం సాధించారు. తన సొంత నియోజకవర్గం గజ్వెల్ పరిధిలో చేపట్టనున్న మల్లన్న సాగర్‌పై ఎట్టకేలకు శాంతియుత ప్రతిపాదనలతో సమస్యను చక్కదిద్దారు. దీంతో ఆయా గ్రామాల్లో ఇంతకాలం వ్యక్తం అయిన నిరసనలు ముగియడంతో ఇక మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగనుంది. రెండు నెలల కిందటి వరకు ఇక్కడి రైతులు దాదాపు వెయ్యి ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు రాలేదు. 2013 భూసేకరణ చట్టం సంపూర్ణంగా అమలు చేసి మెరుగైన జీవితం కొనసాగించేందుకు తగిన విధంగా పునరావాసం, పునర్ ఉపాధి (ఆర్‌అండ్‌ఆర్) కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో మల్లన్నసాగర్ ముంపు ప్రభావిత గ్రామం వేములఘాట్‌లో భూసేకరణకు మార్గం సుగమమైంది. రెండోసారి తెరాస భారీ ఆధిక్యంతో అధికారంలో రావడం, బలమైన ప్రతిపక్షం లేకుండా పోవడంతో రైతులు భూ సేకరణకు సమ్మతించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడి కాంగ్రెసు నేత మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డి తెరాసలో చేరడం, ఆయన నేరుగా సీఎం కేసీఆర్‌తో చర్చించి రైతులు కోరుతున్న విధంగా ఎకరాకు రూ.11 లక్షల పరిహారానికి ఒప్పింపజేశారు. దీంతో సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వేములఘాట్ రైతుల నుంచి మిగిలిన వెయ్యి ఎకరాల భూమిని ప్రభుత్వం పేరిట రిజిస్టేష్రన్ చేశారు. దీంతో 963 రోజుల పాటు కొనసాగిన దీక్షకు సెలవు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టును 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాల్సిన అవసరం లేదని వాదించారు. దీంతోపాటు వారు సాగించిన న్యాయ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చి ఎకరాకు రూ.11 లక్షల పరిహారంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గ్రామస్థులు చేస్తున్న దీక్షలకు తాత్కాలికంగా సెలవు ప్రకటిస్తూ అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేసేవరకు పోరాటం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. 963 రోజులు, రెండున్నర సంవత్సరాలకు పైగా, ముప్పయి రెండు నెలల పాటు తొగుట మండలం మల్లన్నసాగర్ ముంపు ప్రభావిత గ్రామం వేములఘాట్‌లో రైతులు చేపట్టిన దీక్షలకు నాలుగు రోజుల క్రితం సెలవు ప్రకటించారు. మల్లన్నసాగర్ రిజర్వాయరు నిర్మాణానికి దాదాపు 17 వేల ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం నిర్ణయించగా అందులో వేములఘాట్ గ్రామానికి చెందిన భూమి 5398 ఎకరాలు ఉంది. ఇందులో 4400 ఎకరాల వరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా సుమారు వెయ్యి ఎకరాల భూమిని ఇచ్చేందుకు నెలక్రితం వరకు అక్కడి రైతులు ససేమిరా అన్నారు. వేములఘాట్ రైతులు గ్రామంలోని భూములను కాపాడుకోడానికి 2016 జూన్ 5న దీక్షలు ప్రారంభించారు. 2017 సెప్టెంబర్‌లో 2013 భూ సేకరణ చట్టం అమలుకు ప్రాథమిక ప్రకటన చేయించారు. వేములఘాట్‌లో భూసేకరణ చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం గ్రామస్థులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించలేదు. గ్రామంలో దీక్షను ఎత్తివేసినా రైతులు, రైతు కూలీలు, ఇతరులకు ఆర్‌అండ్‌ఆర్ అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అర్హులందరికీ పునరావాసం, పునర్‌ఉపాధితో పాటు నిర్మాణాల సర్వేను కూడా పారద్శకంగా అమలు చేసేందుకు ఈ కమిటీ పని చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా సమస్యల పరిష్కారం కావడంతో ఈ ప్రాంతంలో భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.