మల్లేపల్లి పాఠశాల విద్యార్థుల అగచాట్లు

ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని కూసుమంచి మండలం మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు పైకప్పు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి తరగతి తడుస్తూ విద్యార్థులు చదువుకుంటున్నారు. కూసుమంచి తహశీల్దార్‌ వీరయ్య, ఎండిఓ తిరుపతయ్య తదితరులు ఆ గ్రామానికి వెళ్లి పాఠశాల సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కష్టాలను చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. పాఠశాలలు ఆరునుంచి పదవ తరగతివరకు ఇంగ్లీష్‌ మీడియంతో కలిసి 300పైగా విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో కేవలం ఐదు తరగతి గదులు ఉండడం, అందున మూడు గదుల్లో పైకప్పు రేకులు సరిగా లేకపోవడంతో వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్‌ పాఠశాలలో నెలకొన్న సమస్యలను అధికారులకు వివరించారు. సరిపడినన్ని గదులు లేకపోవడంతో కురుస్తున్న గదుల్లోనే విద్యార్థులను కూర్చోబెట్టాల్సి వస్తుందన్నారు. పాఠశాలకు తరగతి గదులు మంజూరు చేయాలని ఆయన కోరారు.