మళ్లీ అందుబాటులోకి గోవా స్విమ్మింగ్‌ పూల్స్‌

పనాజి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గోవా బీచ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయంటూ వాటిలో స్విమ్మింగ్‌ను కొన్ని వారాల కిందట నిషేధించారు. అయితే గురువారం నుంచి అవి మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. బీచుల్లో స్విమ్మింగ్‌ చేసుకోవచ్చని అక్కడి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే కొన్ని ప్రమాదకర ప్రాంతాలను నో సెల్ఫీ జోన్లుగా ప్రకటించారు. ఇలాంటివి మొత్తం 24 ఉన్నాయి. గోవాలోని అన్ని బీచులూ స్విమ్మింగ్‌కు అనుకూలంగానే ఉన్నా.. కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని దృష్టి ఏజెన్సీ సూచించింది. పసుపు రంగు జెండాలు ఉంచిన స్విమ్‌ జోన్లలోనే స్విమ్మింగ్‌ చేస్తే మంచిదని టూరిస్టులను కోరుతున్నది. ఎరుపు రంగు జెండాలు ఉన్న వాటిలో స్విమ్‌ చేయకూడదని స్పష్టం చేసింది.వర్షాకాలం ముగిసిన తర్వాత రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రమాద రహిత స్విమ్మింగ్‌ జోన్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి లైఫ్‌సేవింగ్‌ లైఫ్‌గార్డ్‌ ఏజెన్సీని నియమించింది. ఈ ఏజెన్సీ అన్ని బీచుల్లో స్విమ్మింగ్‌ అనుకూల ప్రాంతాలను గుర్తించి నవంబర్‌ 1 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఏజెన్సీ ప్రతి రోజు ఉదయం వాతావరణ, సముద్ర పరిస్థితులను అంచనా వేసి సేఫ్‌ స్విమ్మింగ్‌ జోన్లను గుర్తించింది. ఏజెన్సీలోని 600 మంది లైఫ్‌గార్డ్‌ బలగాలను ఉపయోగించి ఈ పని పూర్తి చేశారు.