మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే!

– తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు
– 110 అసెంబ్లీ, 20ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం
– నేడు ఢిల్లీలో అన్ని పార్టీలతో కలిసి ధర్నా
– నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మే20(జ‌నంసాక్షి) : మళ్లీ అధికారంలోకి వచ్చేది తెదేపానేనని, తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో  తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18 నుంచి 20 ఎంపీ స్థానాలు పార్టీ గెలుస్తున్నట్లు వెల్లడించారు. 110 అసెంబ్లీ స్థానాలతో తమ గెలుపు ఖాయమని.. ఇది 120-130వరకూ వెళ్లొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు మైండ్‌ గేమ్స్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి మైండ్‌ గేమ్స్‌ ప్రకటనలతో పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని చంద్రబాబు సూచించారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చామని, రైతులకు అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కనుక లాంటి అద్భుతమైన పథకాలు అందించామన్నారు. ఈ పథకాల వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని తెలిపారు. దీంతో వారంతా తెదేపాకు అండగా నిలిచారని, దీంతో తెదేపా గెలుపు అనివార్యంగా మారుతుందని చంద్రబాబు అన్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని విమర్శించారు. తొలుత వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్‌తో  మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల కమిషన్‌ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా అప్రమత్తంగా ఉండాలని, 22వ తేదీన కౌంటింగ్‌ పక్రియపై అందరికీ మరోమారు శిక్షణ నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. వీవీపాట్ల లెక్కింపులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు, మోదీ అందరినీ బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.