మళ్లీ కాంగ్రెస్ సంకీర్ణమే దిక్కు కానుందా?
జాతీయస్థాయిలో మరోమారు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ అంటే ఇష్టం లేకున్నా బిజెపిని భరించడం కష్టమని భావిస్తున్న పార్టీలే దేశంలో ఎక్కువగా ఉన్నాయి. బిజెపి రావాలని, కావాలని కోరుకున్న పార్టీలు, ప్రజలు కూడా ఇక బిజెపి వద్దనుకునే స్థితిలో ఉన్నారు. కర్నాకటలో కుమారసంభవంతో సంకీర్ణ యుగం మళ్లీ ప్రారంభం కాక తప్పదని సూచిస్తున్నాయి. మళ్లీ ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడక తప్పని పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం బిజెపియేనని,ప్రత్యేకంగా మోడీ అని చెప్పుకోక తప్పదు. తనకు వచ్చిన పూర్తి మెజారిటీతో మోడీ దేశ దరిద్రాన్ని వదలగొడతారని అంతా భావించారు. ప్రజలకు మేలు జరుగుతందని భావించారు. కానీ ప్రజల స్వేచ్ఛను హరించేలా, ఆర్థిక స్థితిగతులను శాసించేలా తీసుకున్న చర్యల కారణంగా ప్రజలకు వ్యక్తిగత ఆర్థిక స్వేఛ కూడా లేకుండా పోయింది. దేశంలో మంచి మార్పు వస్తుందని అనేక ప్రాంతీయ పార్టీలు బిజెపిని నమ్మాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం సాగుతుందని భావించారు. కానీ నాలుగేళ్ల పాలన ప్రజలకు కూడా మొహం మొత్తింది. ఎంతగా అంటే మన్మోహన్ సింగే నయమన్నంతగా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బాగుపడాలని కోరుకోవడంలో తప్పులేదు. అలా అభివృద్ది జరిగితే దేశమే పురోగమిస్తుంది. కానీ అలా జరగడం లేదు. కర్నాటక వ్యవహారాలను తనకు అనుకూలంగా మలచుకుని కాంగ్రెస్ మరోమారు సంకీర్ణాలకు తామే కేంద్ర బిందువని చాటింది. కర్నాటకలో అధికారం నేరుగా కాంగ్రెస్ చేతుల్లో లేకపోయినా తమ గుప్పిట్లోనే పెట్టుకుంది. అంతేగాకుండా కాంగ్రెస్‌ను విమర్శించే చంద్రబాబు లాంటి వారిని సైతం దగ్గరకు వచ్చేలా చేసింది. దీనికి కారణం మోడీ కాక మరొకరు కాదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీ(ఎస్) నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విపక్షాల ఐక్యతకు వేదికగా మారింది. భావ సారూప్యత కలిగిన పార్టీలు సమావేశమయ్యేందుకు, వివిధ అంశాలపై చర్చించుకునేందుకు వేదికగా మారింది. బెంగళూరులో బుధవారమంతా నేతల మధ్య సమావేశాలు సాగిన తీరు గమనిస్తే అంతా కలసి మోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టాలన్న భావన ఏర్పడింది. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్గానో, తృతీయ కూటమిగానో ఏర్పడుతున్నట్లు ఇప్పటికిప్పుడు ప్రకటించక పోయినా రాబోయే నాలుగైదు నెలల్లో ఆ దిశగానే వీటి ప్రయాణం సాగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, భాజపాలతో కలిసి పని చేస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీల్నీ ఈ వేదికపైకి తీసుకురావడం కూడా ఓ విజయంగానే భావించాలి. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల నేతలందరితోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీల మధ్య సంబంధాల్ని బలోపేతం చేసేందుకు మరింతగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగానే నాయకులు అభిప్రాయపడ్డారు. వారి సూచన మేరకు తానే చొరవ తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇందుకు కాంగ్రెస్‌ను అంటరానిదిగా చూడాల్సిన అవసరం కూడా బాబుకు కన్పించడం లేదు. కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలు ముందుగా కలసివస్తే చాలని వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తోంది. తన ప్రమేయం లేకుండానే ప్రాంతీయ పార్టీలు కలసి రావాలని, మోడీ భ్రమల నుంచి పార్టీలు బయటపడాలని చూస్తోంది. నిజానికి మోడీ అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రకటించిన ఆదర్శాలు గంగలో కలిశాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబధాలు హీనంగా తయారయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలన్న కక్కుర్తిలో ఆరోగ్య కరమైన చర్యలు తీసుకునే బదులు బిజెపి దేశంలో అనారోగ్యకరమైన వాతావరణం సృష్టించింది. 2014లో బిజెపి ప్రభంజనం వీయడానికి కారణమైన మోడీ తీరు ఇవాళ బిజెపి నేతలకు కూడా మింగుడు పడడం లేదు. పార్టీ అంటే మోడీ, అమిత్‌షా అన్న భావం ఏర్పడింది.ఎన్నికల్లో గెలవడానికి ప్రజోపయోగమైన,
నిర్మాణాత్మకమైన చర్యల ద్వారా ప్రజల మనసు చూరగొనేందుకు ప్రయత్నించే బదులు వ్యూహాలు, దుష్పచ్రారాలు, కుతంత్రాలపై ఆధారపడవలిసి వస్తున్నది. దీని వల్ల పడిపోతున్న తన గ్రాఫ్‌ను పడిపోకుండా కొంత అడ్డుకోగలరేమో కాని పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదని మోడీ గుర్తించడం లేదు. రాషట్రాల్లో అధికారం దక్కించుకోవడంతో పాటు ప్రజోపయోగ పనులు చేయడంద్వారా ప్రజలను ఆకట్టుకుని ఉంటే మోడీకి తిరుగు ఉండేది కాదు. కానీ ఈ నాలుగేళ్లూ ఉపన్యాసాలు, విన్యాసాలు, విదేశీ పర్యటనలకే సమయం వెచ్చించి మోడీ మరో ఏడాదిలో ఇప్పుడు అద్భుతాలు చేయగలరంటే ఎవరు నమ్ముతారు? ఇప్పటికే అనేక అద్భుతాలు చేశామంటే కూడా ఎవరు నమ్ముతారు. బిజెపి వస్తే పొడుస్తుందని భావించిన ప్రజల్లోనే ఇక బిజెపిపై భ్రమలు తొలిగాయి. తాము కోరుకున్న బిజెపి లేదన్న భావనకు వచ్చారు. వాజ్‌పేయ్, అద్వానీల, మురృమనోహర్ జోషిల లాంటి వారి నాయకత్వంలో ఉన్న బిజెపి కాదని గుర్తించారు. ఇకపోతే కర్ణాటకలోనే సంకీర్ణ ప్రభుత్వం రాకుండా ఆపలేని మోదీ జాతీయ స్థాయిలో ఆపగలరా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. కర్ణాటకలో అధికారానికి ఆమడ దూరంలో వచ్చి ఆగిపోయిన మోదీ జాతీయ స్థాయిలో ఇంకెంత దూరంలో వచ్చి ఆగిపోతారో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎంత ఇష్టం లేకపోయినా బిజెపికన్నా కాంగ్రెస్ పార్టీయే నయమన్న భావన రావడమే అతిపెద్ద ప్రమాదంగా మారింది. ఇదంతా మోడీ స్వయంకృతం తప్ప మరోటి కాదు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన నేతగా మోడీ మిగులుతారని చరిత్రలో చదవక తప్పదేమో. అనివార్యంగా అయినా ప్రజలకుకాంగ్రెస్ సంకీర్ణమే దిక్కు కాక తప్పదేమో.