మళ్లీ కోదండరాం అరెస్టు

– ఇది అధికార దుర్వినియోగం

– జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌,ఆగష్టు 12(జనంసాక్షి):తెలంగాణలో రైతుల సమస్యలపై శాంతి యాత్ర చేస్తుంటే అడుగడుగునా అడ్డగించి అరెస్టులు చేయడం ముమ్మాటికీ అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. సభలు సమావేశాలు రాజ్యాంగం కల్పించిన హక్కులని దీనిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన ఆరోపించారు.నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించతలపెట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర వాయిదా వేస్తున్నట్లు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో యాత్రను వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలో నిజామాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తామని, నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధి, సమస్యలపై చర్చిస్తామని కోదండరాం తెలిపారు. అంతేగాక నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని, అరెస్ట్‌ చేసిన జేఏసీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోదండరాం పేర్కొన్నారు.అమరుల స్ఫూర్తి యాత్రకు నిజామాబాద్‌ జిల్లా ఎస్పీ అనుమతి ఇవ్వలేదని కోదండరామ్‌ అన్నారు. దీంతో తాము నిజామాబాద్‌లోని ఓ హాల్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని.. హాల్‌ విూటింగ్‌కు అనుమతులు అవసరం లేదని, అయినప్పటికీ పోలీసులకు సమాచారమిచ్చామని ఆయన పేర్కొన్నారు. తార్నాకలోని తన నివాసంలో ఐకాస నేతలతో సమావేశం అనంతరం కోదండరామ్‌ విూడియాతో మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా ఒకప్పుడు సిరిసంపదలతో ఉన్న జిల్లా అని.. ఇప్పుడు అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి ఒక మార్గ అన్వేషణ కోసం, జిల్లా ప్రజలను చైతన్యపర్చడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం ఎలాంటి ప్రయతం చేయడంలేదని అన్నారు. కామారెడ్డిలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు కోదండరాం నిజామాబాద్‌ జిల్లాకు వస్తే ఉద్రిక్తపరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని.. పోలీసులు ఆయనను ముందస్తుగా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసారు.