మళ్లీ గులాబీ ప్రభంజనమే కనిపిస్తోంది
ఎన్నికల సరళే ఇందుకు నిదర్శనం
కెసిఆర్ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
సోమారపు సత్యనారాయణ
రామగుండం,డిసెంబర్8(జనంసాక్షి): రాష్ట్రమంతా గులాబీ ప్రభంజనమే కన్పిస్తుందని, సీఎం కేసీఆర్ మరోమారు సిఎం కావడం ఖాయమని రామగుండం టిఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. ప్రజలు మరోమారు తమపై విశ్వాసం చూపారని, ఓట్లు వేసి తమ అభిమానం చాటారని అన్నారు. ఇందుకు తను కృతజ్ఞుడినని అన్నారు. కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు తిరిగి టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగానే కాకుండా కేసీఆర్ నాలుగేళ్ల మూడు నెలల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు ఆదరించారన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు వేలాదిగా వాహనాల్లో గ్రామాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న తీరు టిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు ఇప్పటికీ కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో మళ్లీ దోపిడీ చేసేందుకు కాంగ్రెస్‌తో జతకట్టి తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలు అప్రమత్తమై ఓటు ద్వారా తరిమి వేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎన్నో కుట్రలు పన్నారని తెలిపారు. అయినా కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా పారదర్శకంగా పాలన సాగించారని
అన్నారు. రాహుల్‌గాంధీ చంద్రబాబుతో దోస్తీ కట్టడం దారుణమన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని తిరిగి ఆంధ్రాకు తాకట్టుపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ప్రజలు తట్టుకోలేదని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటిమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అర్థమయ్యిందని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్న టిఆర్‌ఎస్ నేతలను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని చెప్పారు. ఓటింగ్ సరళి సూచిన తరవాత రాష్ట్రంలో మళ్లీ అధికారం టీఆర్‌ఎస్ పార్టీదేనని, రాష్ట్రవ్యాప్తంగా 80 నుంచి వంద స్థానాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతారని స్పష్టం చేశారు. మహాకూటమి బూటకపు వాగ్దానాలను ప్రజలు ఎవరూ నమ్మకుండా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ పాలనను గుర్తించిన ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీకే తమ ఓటు వేశారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు. టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు నమ్మి, తిరిగి అధికారం రావాలని తమ పార్టీకే ఓటు వేశారనీ, ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.