మళ్లీ చెలరేగిన అల్లర్లు : సిర్సాలో హైఅలర్ట్

636395333021386675

హరియాణా: డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌సింగ్‌ అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. అత్యాచారం కేసులో గుర్మీత్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల పాటు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో సిర్సాలోని ఆయన భక్తులు అల్లర్లు సృష్టించారు.ఫూల్కా ప్రాంతంలో రెండు కార్లను తగులబెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 25న గుర్మీత్‌ను దోషిగా నిర్థారిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జస్టిస్‌ జగ్దీప్‌ సింగ్‌ తీర్పు వెలువరించగా.. పంజాబ్‌, హరియాణా, తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆయన మద్దతుదారులు, అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ అల్లర్లలో సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాదిమంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ సమయంలో రోహ్‌తక్‌ న్యాయస్థానం వద్ద ఐదంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాష్ట్ర, కేంద్ర బలగాలతో అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. సిర్సాలో సైన్యం ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించింది.

వాహనాలకు నిప్పుపెట్టిన సంగతి తెలియగానే డేరా చైర్ పర్సన్ విపస్సన ఇన్సాన్ స్పందించారు. అనుచరులంతా శాంతించాలని కోరారు. ముందస్తు జాగ్రత్తగా సునరియ జైలు వెలుపల మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. డేరా బాబా అనుచరులు జైలు వద్ద గుమిగూడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించి కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.