మళ్లీ తెరపైకి బోఫోర్స్‌

– తిరగదోడేందుకు సీబీఐ సన్నాహాలు

న్యూఢిల్లీ,ఆగష్టు 11(జనంసాక్షి):జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ను ఇబ్బంది పెట్టే పరిణామం. బోఫోర్సు కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు 30 ఏళ్ల కిందట దేశాన్ని కుదిపేసిన బోఫోర్సు కుంభకోణాన్ని తిరగదోడేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ పార్లమెంటరీ ప్యానెల్‌కు సమాచారమిచ్చింది. ఈ ప్యానెల్‌లోని చాలా మంది సభ్యులు కూడా ఈ కేసుపై మళ్లీ విచారణ జరిపి సుప్రీంకోర్టు ముందుంచాలని సిఫారసు చేశారు. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌కు తాము సపోర్ట్‌ ఇస్తామని సీబీఐ వెల్లడించింది. స్వీడిష్‌ కంపెనీ ఏబీ బోఫోర్స్‌తో 1986లో రూ.1437 కోట్లతో ఆయుధ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ కింద నాలుగు వందల 155 ఎంఎం ¬విట్జర్‌ గన్స్‌ను భారత ఆర్మీకి సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకోసం బోఫోర్స్‌ సంస్థ భారత్‌కు చెందిన రాజకీయ నేతలు, రక్షణ అధికారులకు లంచం ఇచ్చినట్లు 1987లో స్వీడిష్‌ రేడియో బయటపెట్టింది. దీంతో కుంభకోణం భారత్‌ లో కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ 1990లో బోఫోర్స్‌ యజమాని మార్టిన్‌ ఆర్డ్‌బోతోపాటు మధ్యవర్తి విన్‌ చద్దా, హిందూజా బదర్స్‌పై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. బోఫోర్స్‌ మొత్తం రూ.64 కోట్ల లంచం చెల్లించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 1999లో బోఫోర్సు కేసులో సీబీఐ తొలి చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖత్రోచి సహా నిందితులుగా ఉన్న భట్నాగర్‌, చద్దా, ఆర్డ్‌బో కూడా ఇప్పటికే మరణించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ సోధి హిందూజా బ్రదర్స్‌ శ్రీచంద్‌, గోపీచంద్‌, ప్రకాశ్‌ చంద్‌లతో పాటు బోఫోర్స్‌ కంపెనీపై ఉన్న కేసులను కొట్టేశారు. కేసును దర్యాప్తు చేసిన విధానం ఏమాత్రం బాగోలేదని సీబీఐకి అక్షింతలు కూడా వేశారు. ఈ కేసు దర్యాప్తునకు అప్పటికే సీబీఐ రూ.250 కోట్ల ఖర్చయింది. అంతకు ముందే 2004లో ఢిల్లీ హైకోర్టు జడ్జి జేడీ కపూర్‌ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు.