మళ్లీ విజృంబిస్తున్న స్వైన్‌ఫ్లూ

గాంధీలో ఇద్దరి మృతితో కలవరం

ముందస్తు జాగ్రత్తలు మేలంటున్న వైద్యులు

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): చలిగాలుల తీవ్రత పెరుగుతున్నకొద్దీ స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తు న్నదని, అందువల్ల జాగ్రత్తలే మందు అని గాంధీ వైద్యులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రోజూ పదుల సంఖ్యలో కొత్తగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. చలితో జ్వరం, జలుబు వస్తే చాలు ప్రజలు వణికిపోతున్నారు. స్వైన్‌ఫ్లూ సోకిందేమోనని కంగారు పడుతూ హాస్పిటల్‌కు పరుగులు పెడుతున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు మృతి చెందడంతో మరోమారు భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది సాధారణ జలుబుగా ప్రారంభం అయి, ఆరు రోజుల తర్వాత రోగ లక్షణాలు బయటపడతాయని వైద్యులు తెలిపారి. తగ్గని జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఒళ్లు నొప్పులు, తీవ్ర నీరసం, ముక్కు కారడం, విడువని దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి వాం తులు, విరేచనాలు కూడా అవుతాయి. స్వైన్‌ఫ్లూ రోగులు దగ్గినా, తుమ్మినా వైరస్‌ గాలిలోకి వ్యాపిస్తుంది. పక్కనే ఉన్నవారు ఆ గాలిని పీల్చితే వారి శరీరంలోకి చేరుతుందన్నారు. ఆస్తమా, డయాబెటిస్‌, స్థూలకాయం, గుండె జబ్బులు, తక్కువ రోగ నిరోధకశక్తి ఉన్నవారికి, గర్భిణులకు, చిన్నపిల్లలకు ఈ వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందుతుందని అన్నారు.ఫ్లూ రోగుల తుంపర్లు, ఉమ్ములోనూ వైర స్‌ ఉంటుంది. పొరబాటున వాటిని ముట్టుకొని, ఆ చేతితో నోరు, ముక్కు, కండ్లు, శరీరంపై గాయాలున్నచోట రుద్దుకుంటే వైరస్‌ మన

శరీరంలోకి ప్రవేశిస్తుంది. మార్కెట్‌లో స్వైన్‌ఫ్లూ నివారణ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి డోసు ఇచ్చాక మూడు వారాలు ఆగి మరో డోసు ఇస్తారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత వైరస్‌ను ఎదుర్కొనేం దుకు శరీరానికి రెండు వారా ల సమయం పడుతుంది. స్వైన్‌ఫ్లూ బారినుంచి తప్పించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, వీలైనన్నిసార్లు చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఉండటం తప్ప వేరే మార్గం లేదని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ దగ్గేటప్పుడు, తుమ్మినప్పుడు ముక్కుకు, నోటికి చేతులను లేదా కర్చిఫ్‌, టిష్యూ పేపర్లను అడ్డుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కచ్చితంగా చేతులను, కర్చిఫ్‌ను శుభ్రంగా కడుక్కోవాలి. చిన్నారులకు ముందుగానే సీజనల్‌ ఫ్లూ నివారణ వ్యాక్సిన్లను వేయించాలి. స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్న సమయంలో పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు నోటికి అడ్డుగా సర్జికల్‌ మాస్క్‌ లేదా రుమాలు లేదా కర్చిఫ్‌ చుట్టుకోవాలి. జ్వరంతోపాటు తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, ఒంటి నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఎవరైనా స్వైన్‌ఫ్లూ బారినపడితే మిగతావాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఓవైపు రోగికి చికిత్స అందిస్తూనే సొంత రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. స్వైన్‌ఫ్‌ల్లూ రోగులు ముక్కుకు, నోటికి అడ్డంగా సర్జికల్‌ మాస్క్‌ లేదా కర్చిఫ్‌ వంటివి కట్టుకుంటే ఇతరులకు వ్యాపించదని అన్నారు. తెలంగాణలోనూ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి 24వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 2,572 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇందులో 77 మంది మృతి చెందారు. రాజస్థాన్‌లో అత్యధికంగా ఈ ఫ్లూ బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60 శాతం ఆ రాష్ట్రానివే. 24 రోజుల్లోనే రాజస్థాన్‌లో 1,508 మంది స్వైన్‌ ఫ్లూ బారిన పడగా.. 56 మంది మరణించారు. గుజరాత్‌లో 438 మంది, ఢిల్లీలో 387 మంది, హర్యానాలో 272 మంది ఈ ఫ్లూ బారినపడ్డారు.