మసూద్ అరెస్టును ధృవీకరించని పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్,జనవరి14(జనంసాక్షి): పంజాబ్ లోని పఠాన్ కోట్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న జైష్ ఎ మహ్మద్ అధినేత మసూద్ అజార్ అరెస్ట్ విషయం వట్టిదేనని తేలిపోయింది. పాక్ విూడియా మసూద్ ను అరెస్ట్ చేసినట్లు కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఈ విషయాన్ని పాక్ గానీ భారత్ గానీ ధృవీకరించలేదు. మసూద్ అరెస్ట్ సంగతే తమకు తెలియదని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ కూడా మసూద్ అరెస్ట్ పై తమకు ఎలాంటి సమాచారం లేదన్నది. ఐతే, పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి జరగాల్సిన ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల చర్చలను ఇరుదేశాల అంగీకారంతో ప్రస్తుతానికి వాయిదా వేశారు. పఠాన్ కోట్ ఉగ్ర ఘటనపై పాక్ స్పందిస్తున్న తీరుపై భారత్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సూత్రధారులను శిక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. పాక్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అన్ని ఆధారాలను సమర్పిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉన్న పలు సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని చెప్పారు. పఠాన్ కోట్ ఉగ్ర ఘటనపై ఎన్.ఐ.ఎ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనలో పాక్ పాత్రపై ఆధారాలను సేకరించారు. టెర్రరిస్టులకు భారత్ లో ఎవరు సహకరించారనే దానిపై విచారణ సాగుతోంది. పాక్ అధికారులతోనూ దర్యాప్తు అధికారులు ఎప్పటికప్పుడు కేసుకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నారు.