మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి – కలెక్టరేట్ పరిపాలన అధికారి మస్థాని.
జనగామ (జనం సాక్షి)అక్టోబర్ -09:మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి మస్థాని అన్నారు.మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి మస్థాని బీసీ సంక్షేమ అధికారి రవీందర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరంమహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మస్తానీ మాట్లాడుతూ, మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని, రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని పేర్కొన్నారు. హిందూ ధర్మ శాస్త్రంలో చాలా ప్రాచీనమైన రామాయణ గ్రంథం రచించిన మహాకవి వాల్మీకి అని, ఆయన జీవితం సైతం మనందరికీ ఆదర్శ ప్రాయం అని అన్నారు.
రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను మహాకవి మనందరికీ బోధించారని అన్నారు. మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడీబడి ఉందని తెలిపారు.రామాయణంలోని పితృవ్యాఖ్య పరిపాలన ఒకే భార్య, ఒకే బాణం, ఒకే మాట అనే ఆదర్శాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. మహాకావ్యం రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతిని పండగగా జరుపుకోవడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్,టి.ఎస్.ఎస్.కళాకారులు కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.