మహనీయుల స్పూర్తితో ప్రజా ఆశీర్వాద యాత్ర – ప్రారంభమైన ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ పాదయాత్ర – భారీ కన్వాయ్‌తో ముత్తారం తరలిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

జనంసాక్షి, మంథని : బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ పుట్టమధూకర్‌ చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర సోమవారం ప్రారంభం అయింది. మంథనిలోని రాజగృహ నుంచి బయలు దేరిన ఆయన ముందుగా రావుల చెరువుకట్ట విశ్వబ్రాహ్మణ వీధిలోని హనుమాన్‌ ఆలయంలో ప్రతిష్టించిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంథనిలో ఏర్పాటు చేసిన మహనీయులు జ్యోతిరావుపూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, స్వామి వివేకానంద, చాకలి ఐలమ్మ, జగ్జీవన్‌రాం, ఆచార్య జయశంకర్‌ సర్‌, దొడ్డి కొమురయ్య, బీపీ మండల్‌, సర్థార్‌ సర్వాయి పాపన్న విగ్రహాలకు ఎంపీ బొర్లకుంట వెంకటేష్‌, రామగుండం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌, భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ లతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయుల స్పూర్తితో నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. మంథని నుంచి బీఆర్‌ఎస్‌పార్టీ శ్రేణులు, అభిమానులతో ముత్తారంలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్రకు బారీ కాన్వాయ్‌తో బయలు దేరారు. ముత్తారం మండల కేంద్రంలో ప్రజాఆశీర్వాద యాత్రను ప్రారంభించి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 15 రోజుల్లో 311 కిలోమీటర్లు కొనసాగించనున్నారు.