మహబూబాదే తుది నిర్ణయం

3
– పీడీపీ తీర్మాణం

శ్రీనగర్‌,న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి కట్టబెడుతూ పీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం జరిగిన పీడీపీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. అదేవిధంగా గతంలో కొనసాగినట్టే బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఇటీవల మృతి చెందిన ముఖ్యమంత్రి మహమ్మద్‌ సయీద్‌ సంకీర్ణ ప్రభుత్వ అజెండాను పవిత్ర పత్రంగా భావించారని, అదేవిధంగా కొనసాగాలని ఇప్పుడు పార్టీ కూడా భావిస్తున్నదని పీడీపీ నేత నయీం అఖ్తర్‌ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి డెడ్‌లైన్‌ విధించుకోలేదని ఆయన విలేకరులకు చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా పీడీపీతో తమ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉంటే తమకేవిూ అభ్యంతరం లేదని తెలిపింది.