మహబూబ్‌నగర్‌ బంద్‌ సంపూర్ణం

2

మహబూబ్‌నగర్‌,జులై10(జనంసాక్షి):

పాలమూరు ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ కేంద్ర జలసంఘానికి  ఏపీ సిఎం చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ తెరాస పిలుపు మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో బంద్‌ కొనసాగుతుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకి అంటూ టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎక్కడిక్కడ దుకాణాలు మూసేశారు. బస్సులు నిలిచిపోయాయి.  టిఆర్‌ఎస్‌ శ్రుణులు, రైతులతో కలసి రోడ్డెక్కి నినాదాలు చేశారు. పలుచోట్ల బాబు దిష్టిబొమ్మలు తగులబెట్టారు. బాబు కేంద్రానికి లేఖ రాసినందుకు నిరసనగా మహబూబ్‌ నగర్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో బంద్‌ జరుగుతోంది. బంద్‌కు అన్ని వర్గాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. వ్యాపార వాణిజ్య కేంద్రాలుమూతపడ్డాయి. అత్యవసర సర్వీసులను బంద్‌ నుంచి మినహాయించారు. తెల్లవారుజాము నుంచే ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు బస్‌ డిపోల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. మహబూబ్‌నగర్‌ బస్‌డిపో ఎదుట ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో తెరాస శ్రేణులు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహిస్తున్నారు. బంద్‌ కారణంగా జిల్లాలోని 9 డిపోల పరిధిలో 889 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వనపర్తి, గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో తెరాస శ్రేణులు రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు.  జిల్లాలోని వివిధ డిపోలలో ఉన్న సుమారు తొమ్మిది వందల బస్‌ లు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.  పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్న బాబుపై మండిపడుతున్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి వద్ద జాతీయ రహదారిపై అఖిలపక్ష నేతలు రాస్తారోకో చేపట్టారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని బాబు అడ్డుకోవడం సరికాదని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. బాబుకు పాలమూరు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు.  వలస జిల్లా బాగుపడుతుంటే వలస వచ్చినోడు వంకర బుద్ధితో అడ్డుకుంటున్నాడని విమర్శించారు.  పాలమూరు పచ్చబడుతుంటే పచ్చ బాబు కుట్రలు చేస్తున్నాడు. నాలుగు జిల్లాలకు సాగు, తాగు నీరందించే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడితే అడ్డుకోవడం దారుణమని ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్‌ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు, రైతులు, ప్రజలు నినదించారు. పాలమూరు జిల్లా బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం.. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. బంద్‌ కారణంగా జిల్లా వ్యాప్తంగా వ్యాపార దుకాణాలు, పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రైతన్నలు, ప్రజలు, నేతలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంద్‌లో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.  బస్సు డిపోల ముందు టీఆర్‌ఎస్‌ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 64 మండల కేంద్రాల్లో రైతులు ధర్నా చేపట్టారు.

పాలమూరు ప్రజలే బాబుకు గుణపాఠం చెబుతారు: లక్ష్మారెడ్డి

చంద్రబాబు తెలంగాణ.. పాలమూరు ద్రోహి అని మంత్రి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో దత్తత పేరుతో పాలమూరు జిల్లాను  అణిచివేసాడని  ధ్వజమెత్తారు. పాలమూరు వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి భారీ రుణాలు పొంది సీమాంధ్రలో ఖర్చు పెట్టాడని ఆరోపించారు. చంద్రబాబు తీరును ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకుంటే బాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. కావాలనే వలసల జిల్లా అభివృద్దిని అడ్డుకోవడానికి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబునాయుడు మోకాలడ్డుతున్నాడని అన్నారు.  గతంలో దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాను చంద్రబాబు వల్లకాడు చేయాలని చూస్తున్నాడని ప్రకటించారు.  సమైక్య రాష్ట్రంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి వచ్చిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును అనధికారికంగా నిర్మిస్తున్న బాబు ఇప్పుడు తెలంగాణపై కక్షతో పాలమూరుపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎవరడ్డొచ్చినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం ఆగదని మంత్రి తేల్చి చెప్పారు. జిల్లాకు న్యాయంగా రావాల్సిన కృష్ణానీటి వాటాను తీసుకునేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రులు అన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు ఎత్తిపోతలకు అనుమతి వచ్చిందని అయితే కేంద్రాన్ని, సీడబ్ల్యూసీని తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. మరోవైపు పాలమూరు ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మహబూబ్‌నగర్‌ జిల్లా బంద్‌ కొనసాగుతోంది.  తెలంగాణ అభివృద్దికి టిడిపి ప్రభుత్వం శనిలా మారిందని  విమర్శించారు.చంద్రబాబు కుట్రలను ప్రజలు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని ఆయన కోరారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు తెలంగాణ వచ్చినా చంద్రబాబు దాష్టికాలు తప్పడం లేదని  లక్ష్మారెడ్డి విమర్శించారు. సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖ రాయడంపై ప్రజల ఆగ్రహం తప్పదన్నారు.