మహాకూటమితో తెలంగాణకు ముప్పు
– ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
– కూటమి కుట్రలను ఏకతాటిపైకి వచ్చి తిప్పికొట్టాలి
– సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం
– తెరాసకు మద్దతు పలికి అభివృద్ధికి దోహదపడండి
– ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్, నవంబర్1(జనంసాక్షి) : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆంధ్రా బాబు చంద్రబాబుకు తాకట్టుపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కైందని, ఆ రెండు పార్టీలతో మరో రెండు పార్టీలను వెంటపెట్టుకొని మహాకూటమితో ప్రజల ముందుకొస్తుందని, వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని నిర్మల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ నియోజకవర్గం మామడ మండలంలోని పలు గ్రామాల్లో ఇంద్రకరణ్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంతపూర్, రాంపూర్, పోచమ్మగూడ, బుర్ధపెల్లి, రాశిమెట్లతో పాటు ఇతర గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు బొట్టు పెట్టి ఆశీర్వదించారు. గ్రామాల్లో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆభ్యర్థించారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణను దోచుకునేందుకే టీడీపీ, కాంగ్రెస్ మహకూటమి పేరుతో ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. వీరి కుట్రల పట్ల
తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహాకూటమితో తెలంగాణకు ముప్పు ఉందన్నారు. పేదల పక్షపాతియైన కేసీఆర్ ను ఓడించేందుకు టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు. తెలంగాణ అభివృద్దిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మహకూటమికి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన టీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోలేరని, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ మరోసారి గద్దెనెక్కడం ఖాయమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం ఆసరా ఫించన్లు, వెనకబడిన వర్గాల్లోని ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిపేందుకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు అందించిన సీఎం కేసీఆరే అన్నారు. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే లక్షలాది మంది రైతులకు రుణవిముక్తి కల్పిస్తూ రుణమాఫీ, అన్నదాతలకు సాగుపై ధీమా కల్పించేందుకు రైతులక్ష్మీ పథకం పేరుతో ప్రతి ఎకరాకు 8వేల రూపాయల పెట్టుబడినిధి అందిస్తోందన్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.5 లక్షల రైతు బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. గొల్ల, కురుమలకు 75శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేస్తోందని, అలాగే మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశంలో 100 శాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోందని వెల్లడించారు. అల్లోల వెంట టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు శ్రీహరి రావు, సత్యనారాయణ గౌడ్, రాంకిషన్ రెడ్డి, నవీన్ రావు, శ్రీనివాస్ రెడ్డి,లింగారెడ్డి, తదితరులు ఉన్నారు.