మహాకూటమి సీట్ల సర్దుబాటు!


– కాంగ్రెస్‌కు 95, తెదేపాకు14 స్థానాలు కేటాయింపు
– టీజేఎస్‌, సీపీఐ స్థానాలపై రాని స్పష్టత
– నేడు ఢిల్లీలో రాహుల్‌తో భేటీ కానున్న కోదండరాం
– 8 లేదా 9న కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా
– మూడు కేటగిరిలుగా కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా
– స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌
న్యూఢిల్లీ, నవంబర్‌1(జ‌నంసాక్షి) : మహాకూటమిలో సీట్ల సర్దుబాబు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం
ఢిల్లీలో చర్చించింది. దీనిలో భాగంగా 95సీట్లు కాంగ్రెస్‌ పోటీ చేయనుండగా, 14 స్థానాల్లో టీడీపీ పోటీ చేయడం ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా మిగిలిన టీజేఎస్‌, సీపీఐ పార్టీలకు సీట్ల కేటాయింపుపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా టీజేఎస్‌ ఏడు స్థానాలు, సీపీఐ మూడు స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్‌ నిర్ణయించినప్పటికీ ఆ మేరకు ఇరు పార్టీలు ససేవిూరా అంటున్నట్లు తెలుస్తోంది. టీజేఎస్‌ ఇప్పటికే 12 స్థానాల్లో తమ అభ్యర్ధులను బరిలోకి దింపేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతుంది. మరోవైపు సీపీఐ తమకు ఆరు స్థానాల్లో పోటీ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తూ వస్తుంది. కాగా పలు దఫాల చర్చల అనంతరం గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీతో తెలంగాణ పార్టీ ఇన్‌చార్జి కుతింయా, పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ భేటీలో 95 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ పై అంగీకారం రావడంతో మూడు విడుదతల్లో ఈ జాబితాను ప్రకటించేందుకు నిర్ణయించారు. తొలుత నవంబర్‌ 1వ తేదీనే కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా ప్రకటించాలని కాంగ్రెస్‌ భావించినప్పటికీ కూటీమిలో మిగిలిన అభ్యర్ధుల పోటీపై స్పష్టత రాకపోవటంతో కాంగ్రెస్‌ అభ్యర్ధుల ప్రకటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీపావళి తరువాత 8లేదా 9 తేదీల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాను ప్రకటించేందుకు పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 57మంది అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ సీ్కనింగ్‌ కమిటీ ఓకే చేయడంతో తొలుత 57మంది అభ్యర్దులను ప్రకటించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అటు తరువాత మరో రెండు దఫాలుగా జాబితాలను విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ సన్నద్ధమైంది.
నేడు రాహుల్‌తో భేటీ కానున్న కోదండరాం..
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం శుక్రవారం రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. మహాకూటమిలో సీట్ల కేటాయింపుపై తమకు 12 నుంచి 15 స్థానాల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని కోదండరాం పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు రాహుల్‌తో భేటీకి రావాలని కాంగ్రెస్‌ అధిష్టానం కోదండరాంనుకోరింది. దీంతో శుక్రవారం కోదండరాం రాహుల్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
8 లేదా 9 తేదీల్లో కాంగ్రెస్‌ తొలి జాబితా – కుంతియా, ఉత్తమ్‌
తెలంగాణ మొత్తం 119 స్థానాలకు గాను… 95 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం కుంతియా, ఉత్తమ్‌లు విూడియాతో మాట్లాడారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి 62 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చించామన్నారు. ఇప్పటి వరకు 57స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 8వ తేదీ లేదా 9న జాబితా ప్రకటించనున్నట్టు కుంతియా తెలిపారు. వీలైనంత త్వరలోనే దీనిని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అయితే 119 స్థానాలకు గాను 95  స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తే మిగతా 24 సీట్లను కూటమిలోని మిగతా పక్షాలు పంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ చెప్పారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలా..? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ వివరించారు.