మహాత్మాగాంధీ యూనివర్సివటీ సాక్షిగా జై తెలంగాణ

గవర్నర్‌ పర్యటనలో మార్మోగిన జై తెలంగాణ
తెలంగాణ కేంద్రం పరిధిలో ఉంది : గవర్నర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌కు మహాత్మగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలతో, తెలంగాణ అనుకూల నినాదాలతో మార్మోగింది. తమ సమస్యలు తీరాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని విద్యార్థులు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీలో అన్నీ సమస్యలే ఉన్నాయని, ల్యాబ్‌ ఏర్పాట్లు సరిగ్గా లేవని, తాగునీటి సౌకర్యం లేక ఫ్లోరైడ్‌ నీటితో దాహం తీర్చుకుంటున్నామని తెలిపారు. ఫ్లోరైడ్‌ నీళ్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థులు ఆయనకు వెల్లడించారు. తమను పరీక్షించడానికి నియమితుడైన వైద్యుడు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదని, అధికారులకు తమ సమస్యలను తెలిపితే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ యూనివర్సిటీ సమస్యలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని, ఆ దిశగా గవర్నర్‌ తన వంతు కృషి చేయాలని కోరారు. దీనిపై గవర్నర్‌ స్పందిస్తూ యూనివర్సిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇక తెలంగాణ అంశంపై వివరణ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టగా, ఆ విషయం తన పరిధిలో లేదని, దాన్ని కేంద్రం చూసుకుంటుందని వివరణ ఇచ్చారు. ఇక్కడే కాకుండా జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం డి.నాగారం గ్రామస్తులు గవర్నర్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఫ్లోరైడ్‌ నీటితో తాము రోగాల బారిన పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై గవర్నర్‌ స్పందిస్తూ తప్పకుండా ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం దిశగా తమ చర్యలుంటాయని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు గవర్నర్‌ కాన్వాయ్‌కు దారినిచ్చారు.