మహానటి విజయంలో అందరిదీ ప్రేమాత్మక పాత్ర
తానొక్కడినే క్రెడిట్ కొట్టేయలేను
విజయోత్సవంలో నాగ్ అశ్విన్
హైదరాబాద్,మే25(జనంసాక్షి): మహానటి’ సినిమాకు వచ్చిన క్రెడిట్ మొత్తం తానే తీసుకోవాలని ఉంది.. కానీ, అది కుదరని పని’ అని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. ఆయన దర్శకత్వంలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రమిది. అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన
పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విశేషమైన స్పందన లభించింది. సావిత్రి పాత్రకు తెరపై జీవం పోశారంటూ విమర్శకులు, ప్రముఖులు ప్రశంసించారు. సినిమా బాక్సాఫీసు వద్ద కూడా విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం విజయోత్సవ వేడుకను నిర్వహించి అందరికీ ధన్యవాదాలు తెలిపింది.
ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘నేను కథ రాసుకున్నాను కాబట్టి, దర్శకత్వం వహించానని.. ‘మహానటి’ రూపొందలేదు. ఓ మ్యాజిక్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నేనే తీసుకోవాలని నాకూ ఉంది. కానీ, అది కుదరని పని. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నిర్మాతలుగా ప్రియంక, స్వప్నలకు ఇది ఓ రిస్క్ లాంటిది. ‘మహానటి’ కూడా అంతే. చాలా బ్జడెట్ పెట్టారు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరు కష్టపడి, ప్రేమగా సినిమా చేశారు. ఆ ప్రేమ సినిమాలో కనిపించింది, ప్రేక్షకులు దానికి కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో కనిపించని ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఓ షాట్ తీయడానికి వందల మంది పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్, మోహన్‌బాబు, సమంత, దుల్కర్, విజయ్.. ఇలా అందరూ తమ శక్తికి మించి కష్టపడ్డారు. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి, ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ ఏదో జరుగుతోంది. ఏం చేశానో నాకే తెలియదు’ అని అన్నారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘సావిత్రి గారి గురించి ఈ సినిమాకు ముందు నాకు పెద్దగా తెలియదు. తొలిరోజు ప్రివ్యూ చూసి నా మైండ్ బ్లో అయ్యింది. రోజూ నా పాత్ర షూట్ అయిపోగానే వెళ్లిపోయేవాడ్ని. నా కాస్ట్యూమ్స్ వరకు నేను చూసుకున్నా. సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్.. ఇవన్నీ చూడలేదు. కానీ, సినిమా విడుదలైన తర్వాత చూస్తే.. నా వెనుక ఇంత చేశారా? ఇంత జరిగిందా? అనుకున్నా. విూ అందరికీ నచ్చిన మరో సినిమాలో నా భాగస్వామ్యం ఉండటం చాలా సంతోషంగా ఉంది. ‘మహానటి’లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ‘ఎవడే సుబ్రమణ్యం’ టీంతోనే మళ్లీ పనిచేశా. ఈ సినిమాలో నన్ను చూడాలని వచ్చిన యూత్ కూడా నిరాశ చెందలేదు. అంత చక్కగా ఉందీ సినిమా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. ‘మహానటి’ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, విూడియాకు ధన్యవాదాలు. నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్న తదితరులు వీరిలో ఎవరు లేకపోయినా.. సినిమాలో ఏదో మిస్ అయ్యేది. సావిత్రి బయోపిక్‌లో నటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా విడుదలైన తర్వాత ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాలు పెడుతున్నారు. ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారు. నాకు నిరంతరం మద్దతుగా ఉన్న మా అమ్మ, నాన్న, సోదరికి ధన్యవాదాలు’ అంటూ ముగించారు.