మహాపాదయాత్రకు అడ్డంకులు ఎందుకు
అధికార పార్టీ నేతల్లో ఎందుకీ వణుకు
వారి యాత్రతో భయపడాల్సిన అవసరమెందుకు?
నెల్లూరు,డిసెంబర్2 (జనం సాక్షి): రాజధాధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అడుగడుగునా వైసిపి నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పాదయాత్రలుచేసిన అనుభవం ఉన్న నేతగా జగన్ పార్టీ ఎందుకీ విధంగా వ్యవహరిస్తోందన్నది తెలియంది కాదు. రైతులు బలపడితే తన సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న భయం కావచ్చు.. లేక ఉద్యమం వెనక టిడిపి ఉందన్న అనుమానం కావచ్చు..వారి యాత్రను సజావుగా సాగనీయడం లేదు. 31వ రోజు బుధవారం నెల్లూరు జిల్లాలో పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో చూడవచ్చు. దీంతో మరుపూరు వద్ద రోడ్డుపై రైతులు, మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ఉన్న వాహనాలకు ఇప్పుడెందుకు అభ్యంతరం తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే భోజనం కోసం టెంట్ వేయడానికి ప్రయత్నం చేయగా వైసిపి నేతలు అడ్డుపడ్డారు. దీంతో రైతులు రోడ్డుపైనే భోజనం చేసి నిరసన తెలిపారు. బుధవారం రాత్రీ వైసిపి నేతలు బెదిరింపులకు దిగడంతో పొదలకూరులోని కళ్యాణమండపంలో రైతులు బస చేశారు. పాదయాత్రకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్ మద్దతు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించిన సమయంలో రైతులు మరుపూరు గ్రామంలోని దేవాలయం, దాని పక్కనే ఉన్న పొలంలో బస కోసం టెంట్లు వేశారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆ ప్రాంత వైసిపి నేతలు ఒక్కసారిగా అడ్డంకులు సృష్టించారు. విఆర్‌ఒ అక్కడకు వచ్చి ఇక్కడ ఉండటానికి వీల్లేదని, ఇది వైసిపి నేత పొలమని చెప్పడంతో వివాదం చెలరేగింది. ముందుగా చెబితే తాము మరో చోటు చూసుకునేవారమని, ఇలా ఇబ్బందులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదేశాలతోనే ఇలా చేస్తున్నారని రైతులు విమర్శించారు. దీంతో రాత్రి కొందరు ఎస్‌ఎల్‌వి లేవుట్‌లోనూ, మరికొందరు నెల్లూరులోని శాలివాహన కళ్యాణమండపంలో బస చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో సాఫీగా సాగిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఇప్పుడు అడ్డంకులు ఎదురవుతున్న తీరు అధికార పార్టీ కనుసన్నల్లోనే సాగుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర పేరిట రైతులు చేస్తున్న యాత్రకు అడుఏగడుగునా అధికార పార్టీ నాయకులు, పోలీసులు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ నాయకులు, సీపీఎం నేతలపైనా కేసులు పెట్టారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమించారని, అధిక ధ్వని చేశారనే కారణాలతో కేసులు పెట్టడం గమనార్హం. ఇది జగన్ తీరుకు అద్దం పడుతోంది. ఆయనపట్ల ప్రజల్లో ఉన్న మంచిని చెరిపేస్తోంది. రైతులను అడ్డుకోవడం ద్వారా మరింతగా వ్యతిరేకత కొని తెచ్చుకోవడ తప్ప మరోటి కాదు.