మహారాష్ట్రతో దోస్తానా!

C

– సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన

– ఫడ్నవిస్‌ ఆహ్వానం మేరకు మరాఠకు సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి):దశాబ్ధాలుగా వివాదాల్లో నలుగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఇక మోక్షం లభించనుంది. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడంతో పాటు.. హైదరాబాద్‌ కు సమృద్ధిగా తాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన సాగునీటి ప్రాజెక్టుల చిక్కుముడులు వీడుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సామరస్యపూర్వక వైఖరి, మహారాష్ట్రకు అభ్యంతరం లేని విధంగా చేసిన రీ డిజైనింగ్‌ తో ప్రాజెక్టుల నిర్మాణానికి గొప్ప ముందడుగు పడింది. గోదావరి, ప్రాణహిత, పెన్‌ గంగ నదులపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి ఒప్పందాలు చేసుకుందామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ కు ఫోన్‌ చేసి ఈ మేరకు ఆహ్వానం పలికారు. గోదావరి, పెన్‌ గంగ, ప్రాణహిత నదులపై నిర్మించే ఐదు బ్యారేజీల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. సీఎం కేసీఆర్‌ తో ఫోన్‌లో మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాల కోసం మహారాష్ట్రకు ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేకూర్చేలా మూడు నదులపై ప్రాజెక్టులు నిర్మించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫడ్నవీస్‌ చెప్పారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌ గంగ నదుల నీళ్లను సమర్థవంతంగా వాడుకొని రైతాంగానికి మేలు చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 7న మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు, అధికారులు వెళ్లనున్నారు. ఈ నెల 8న ముంబైలో ఒప్పంద పత్రాలపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేస్తారు. పెన్‌ గంగపై రాజాపేట దగ్గర ఒక బ్యారేజీ, చనాఖ-కొరాట మధ్య మరో బ్యారేజీ, పెన్‌ పహాడ్‌ దగ్గర ఇంకో బ్యారేజీ నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహట్టి దగ్గర, గోదావరిపై కరీంనగర్‌ జిల్లా మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు నిర్మించనున్నారు. రాజాపేట, పెన్‌ పహాడ్‌ ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుండగా.. మిగతా మూడు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్నది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల మధ్య మరో రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే బ్యారేజీలకు ఇప్పటికే ప్రభుత్వ పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. గతంలో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర అభ్యతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ప్రాజెక్టుల రీడిజైన్‌ చేపట్టిన సీఎం కేసీఆర్‌, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌ తో సమగ్ర అధ్యయనం చేయించారు. వాటి వివరాలను మహారాష్ట్రకు తెలిపి, అభ్యంతరాలు లేకుండా అంగీకరింపజేశారు. గతేడాది ముంబైకి వెళ్లి మహారాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రితో సీఎం కేసీఆర్‌ చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదిత ప్రాంతాల్లో మహారాష్ట్ర అధికారులు పర్యటించి అధ్యయనం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర అధికారులతో కలిసి మంత్రి హరీష్‌ రావు మహారాష్ట్రలో పర్యటించారు. ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులతో చర్చించారు. ఇరు రాష్ట్రాల ఒప్పందంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంతో ముందుకు సాగనున్నది. ఇప్పటికే బ్యారేజీల నిర్మాణంలో స్పష్టతతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌ కు కూడా మంచినీరు అందించే అవకాశం ఉంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే బృహత్‌ సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. గోదావరిలో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండే చోట బ్యారేజీ నిర్మించి, సాగునీరు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో ఉంది.