మహారాష్ట్రలో మరో స్కాం

మహారాష్ట్ర : బిజెపి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్కుండానే స్కాంలు బయటపడుతున్నాయి. పంకజ్‌ ముండే స్కాం మరవక ముందే మరోమంత్రి వినోద్‌ తావ్‌డే టెండర్ల స్కాం వెలుగులోకి వచ్చింది. తాజాగా అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లకు సంబంధించి విద్యాశాఖలో 191 కోట్ల రూపాయల స్కాం వెలుగు చూసింది. విద్యాశాఖ మంత్రి వినోద్‌ తావ్‌డే అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లకు సంబంధించిన191 కోట్ల రూపాయల స్కాం బయటపడింది. జిల్లా పరిషత్‌ స్కూళ్లలో 62 వేల 105 అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ఫిబ్రవరి 11న విద్యాశాఖ థానేకు చెందిన ఫైర్‌ ఇంజనీర్లకు కాంట్రాక్ట్‌కు ఇచ్చింది. ఒక్కో అగ్నిమాపక యంత్రం ధర 8 వేల 321 రూపాయలుగా నిర్ణయించింది. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే 191 కోట్ల రూపాయల కాంట్రాక్టులపై విద్యాశాఖ డైరెక్టర్ సంతకం చేయడం వివాదాస్పదంగా మారింది. 3 లక్షలు దాటితే ఈ టెండర్ల ద్వారా కాంట్రాక్టు ఇవ్వాలన్న నిబంధనలను విద్యాశాఖ అతిక్రమించడంతో ఆర్థికశాఖ దీనిపై విచారణకు ఆదేశించింది. దీంతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టును నిలుపదల చేశారు.అగ్నిమాపక యంత్రాల కొనుగోలుకు సంబంధించి తాను ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని, ఆర్థిక శాఖ ఆదేశంతో కాంట్రాక్టర్లకిచ్చిన ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు విద్యామంత్రి వినోద్‌ తావ్‌డే పేర్కొన్నారు. మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే రెండు స్కాంలు బయటపడ్డాయి. గతవారం మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పంకజా ముండే అంగన్‌వాడి పిల్లలకు సంబంధించిన వస్తు సామాగ్రి కొనుగోళ్లలో 206 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యామంత్రి వినోద్‌ తావ్‌డే ఇప్పటికే ఫేక్‌ సర్టిఫెకేట్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు అవినీతి మంత్రులను తొలగించాలంటూ కాంగ్రెస్‌ ఆందోళనను తీవ్రం చేసింది. పంకజా ముండేపై దర్యాప్తు కోసం కాంగ్రెస్‌ ఏసిబికి ఫిర్యాదు చేసింది.కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే బిజెపి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. లలిత్‌ మోడీ గేట్‌తో కేంద్రం సతమతమవుతుంటే…మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులు స్కాంలో చిక్కుకోవడంతో కమలనాథుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది.