మహారాష్ట్ర కేబినెట్‌లోకి కొత్తగా 11మంది


ముంబయి: నేడు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కొత్తగా మంత్రివర్గంలోకి 11 మందిని తీసుకున్నారు. వీరిలో పది మంది తొలిసారి మంత్రి పదవిని చేపట్టారు. కొత్త మంత్రులు ఈరోజు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి కేబినెట్‌ హోదా దక్కగా.. అందులో అయిదుగురు భాజపా ఎమ్మెల్యేలు, ఒకరు రాష్ట్రీయ సమాజ్‌ పార్టీ నేత. మిగతా వారికి సహాయ మంత్రి పదవులు దక్కాయి. అయిదుగురు సహాయ మంత్రుల్లో ఇద్దరు భాజపా, ఇద్దరు శివసేన, ఒకరు స్వాభిమాన్‌ పార్టీ నేత. ఈ కార్యక్రమానికి భాజపా కూటమిలోని శివసేన పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే హాజరుకాలేదు. శివసేనకు కేబినెట్‌ సీట్‌ కేటాయించకపోవడం పట్ల పార్టీ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

సహాయ మంత్రిగా ఉన్న భాజపా నేత రాం షిండేకు కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి లభించింది. కేబినెట్‌ హోదా దక్కిన మరో నలుగురు భాజపా నేతలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ ఫండ్కర్‌, జయ్‌కుమార్‌ రావల్‌, సాంభాజీ పాటిల్‌, సుభాష్‌ దేశ్‌ముఖ్‌. భాజపా కూటమిలోని రాష్ట్రీయ సమాజ్‌ పార్టీ నేత మహదేవ్‌ జనకర్‌కు కేబినెట్‌ హోదా ఇచ్చారు.

స్వాభిమాన్‌ పార్టీ నేత సదాభావు ఖోటెకు సహాయ మంత్రి పదవి దక్కింది. సహాయ మంత్రి పదవి దక్కిన ఇద్దరు భాజపా నేతలు రవీంద్ర చవాన్‌, మాదన్‌ యెరావర్‌. ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు అర్జున్‌ ఖోట్కర్‌, గులాబ్‌రావ్‌ పాటిల్‌లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి.