మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఏర్పాట్లు
పలు ఆలయాల్లో ప్రత్యేకంగా శివరాత్రివేడుకలు
కడప,ఫిబ్రవరి 28 ( జనం సాక్షి): జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రం పొలతల. పార్వతీ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ముస్తాబైంది. పెండ్లిమర్రి మండలం గంగనప్లలె గ్రామ పంచాయతీ శేషాచల పర్వత శ్రేణుల్లోని పాలకొండల్లో పొలతల మల్లికార్జునుడు కొలువై ఉన్నాడు. ఇక్కడికి వచ్చే భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం రోజు రాష్ట్ర నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి
లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్షేత్రంలో మల్లికార్జునుడితో పాటు పార్వతీదేవి, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏడుగురు అక్కదేవతలు, పులిబండెన్న, వినాయక, సుబ్రమణ్యస్వామి, కాశిరెడ్డినాయనస్వాములు నిత్యం ప్రజలచే పూజలు అందుకుంటున్నారు. పొలతల క్షేత్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కాశిరెడ్డినాయన ఆశ్రమం వారు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. కాశిరెడ్డినాయన కూడా ఈ క్షేత్రంలో పర్యటించి పూజలు నిర్వహిం చారని ఆలయ పెద్దలు తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా లక్షల మంది భక్తులకు అన్నిరకాల వంటలను అన్నదాన సత్రం సిద్ధం చేస్తుంది. పొలతలకు చేరే మార్గం పొలతలకు వెళ్లేందుకు ఆర్టీసీ వారు దాదాపు 170 బస్సులను ఏర్పాటు చేశారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటిల నుంచి బస్సు సౌకర్యం కలదు. కడప నుంచి మూలవంక విూదుగా 22 కిలోవిూటర్ల దూరంలో పొలతల క్షేత్రం ఉంది. పులివెందుల వైపు నుంచి వచ్చే వారు వెల్లటూరు విూదుగా చేరవచ్చు. పొలతల క్షేత్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 1వ తేదీ మంగళవారం మహాన్యాసపూర్వక
రుద్రాభిషేకంతో పాటు 10 గంటలకు ముత్యాల తలంబ్రాలతో స్వామి వారి కల్యాణం ఉంటుందన్నారు. రాత్రి 9 గంటల నుంచి చెక్కభజన, హరికథ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 10 గంటలకు స్వామి వారి ఆలయం నుంచి అక్కదేవతల గుడి వరకు రథోత్సవం వైభవంగా జరుగుతుందన్నారు. 2వ తేదీ స్వామి వారి ఉత్సవ ముగింపు కార్యక్రమంతో పాటు హుండీ లెక్కింపు నిర్వహిస్తారని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. ఇకపోతే లంకమల అభయారణ్యంలో వెలసిన నిత్యపూజస్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మండలంలోని వంతాటిప్లలె గ్రామానికి 13 కిలోవిూటర్ల దూరంలోని లంకమల అభయారణ్యంలో 600 ఏళ్ల క్రితమే ఉద్భవలింగం వెలసినట్లు ప్రచారం. ఈ ఉద్భవలింగానికి ప్రతినిత్యం సవిూప కొలనులో అక్కదేవతల స్నానాలు చేసి ఎంతో పవిత్రంగా పూజలు నిర్వహించేవారని ప్రతీతి. 1500వ సంవత్సరంలో పెన్నానది ఒడ్డున ఉన్న మూలప్లలె గ్రామానికి చెందిన అయ్యవారురెడ్డి స్వామి బాలుడుగా ఉన్నప్పుడు గోవుల మందలో నుంచి ఒక గోవు అదృశ్యమై ప్రతిరోజూ ఉద్భవలింగం వద్దకు వెళ్లి పాలు ఇచ్చి వచ్చేది. ఆ దృశ్యాన్ని అయ్యవారురెడ్డి స్వామి చూసి మరుసటి రోజున ఆవును వెంబడిరచి ఉద్భవలింగం ఉన్న చోటును కనుగొన్నారు. ఈ గోవు పాలను ప్రతినిత్యం నిత్యపూజస్వామి స్వీకరించే వారని ఒక కథ ప్రచారంలో ఉంది. అనంతరం పరమేశ్వరుడు అయ్యవారురెడ్డి స్వామి వారికి నాలుకపై బీజాక్షరాలు రాసి భక్తుడిగా చేసుకున్నారని పూర్వీకులు చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన, కార్తీక మాసాల్లో స్వామికి వైభవంగా పూజలు జరుగుతాయి. నిత్య పూజ స్వామి వద్దకు వెళ్లే భక్తులు మొదట పంచలింగాల స్వామికి పూజలు నిర్వహిస్తారు. అక్కడ చెన్నకేశవ స్వామి ఆలయం, అక్కదేవతల విగ్రహాలకు పూజలు చేస్తారు. అక్కడి నుంచి నాలుగు కిలోవిూటర్ల దూరంలో కొండవాలు కింద వెలసిన ఉద్భవలింగం కొండ లోపలిభాగంలో శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిత్య పూజస్వామిని దర్శించుకునేందుకు జిల్లా నుంచే కాకుండా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు తదితర దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తులు పంచలింగాల గుడి వద్ద దారి పొడవునా అన్నదానం, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కార్యనిర్వహణాధికారి సురేష్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు.