మహా ఆఘాడీ మూడు చక్రాల ఆటోలాంటిది
ఎప్పుడు ఏ చక్రం ఊడిపోతుందో తెలియదు
శివసేన బ్రోకర్, కాంగ్రెస్ ’డీలర్ అంటూ అమిత్ షా విమర్శలు
పూణె,డిసెంబర్20( జనం సాక్షి) : మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతున్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మూడు చక్రాలతో నడుస్తోన్న ఆటోలాంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఏ చక్రం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందో తెలియదన్నారు.ఈ ప్రభుత్వానికి నిలకడ లేదు. ప్రజా అభీష్టానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇదని అమిత్ షా అన్నారు. ఇదేసందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం హిందుత్వను ఉద్దవ్ థాకరే తాకట్టు పెట్టారని షా విమర్శించారు. సోమవారం పూణెలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక ఉద్దవ్ థాకరే గురించి మాట్లాడుతూ ఉద్దవ్ ముఖ్యమంత్రి కావడానికి బీజేపీని మోసం చేశాడని అన్నారు. మమ్మల్నే కాదు హిందుత్వను సైతం తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి అయ్యావని విమర్శించారు. ఎన్నికలు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోనే జరుగుతాయని, సీఎం అభ్యర్థి ఫడ్నవీసే అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని, అయినా ఉద్దవ్ పెడచెవిన పెట్టారని షా అన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్)ను మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అన్వయిస్తూ మరో విధంగా అమిత్ షా వర్ణించారు. డీ కాంగ్రెస్ తీసుకుంటుందని డీ అంటే డీలర్ అని, ఇక బీ అంటే బ్రోకర్ అని ఇది శివసేనకు వర్తిస్తుందని, ఇక చివరిగా ఎన్సీపీకి టీ అంటే ట్రాన్స్‌ఫర్ అని అమిత్ షా అన్నారు.