మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

` ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కర్నాటక
` గృహలక్ష్మి పథకం ప్రారంభించిన రాహుల్‌
మైసూర్‌(జనంసాక్షి): ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంనిలబెట్టుకుంది. ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లకు ఇచ్చిన హావిూలను వరుసగా సిద్ధరామయ్య ప్రభుత్వం అమలుపరుస్తోంది. తాజాగా బుధవారం ’గృహలక్ష్మీ’ పథకాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మైసూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్‌గాంధీ మట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరి ప్రియాంక గాంధీ ఈరోజు రాఖీ కట్టిందని, ఇదే రోజు తన చేతుల విూదుగా ’గృహలక్ష్మి’ పథకం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఏవైతే హావిూలు ఇచ్చిందో ఆ హావిూలను నెరవేర్చేందుకు పార్టీ నాయకత్వం కట్టుబడి ఉందన్నారు. ఈరోజు ఈ బటన్‌ నొక్కిన వెంటనే కోట్లాది మంది మహిళల బ్యాంకు అకౌంట్లలో నేరుగా రూ.2000 చొప్పున జమ అవుతాయని చెప్పారు. ప్రతినెలా రూ.2000 చొప్పున మహిళల బ్యాంకు అకౌంట్లలో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. కర్ణాటకలోని మహిళలందిరికి శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హావిూ ఇచ్చి నెరవేర్చామన్నారు. మహిళా సాధికారతే తమ పథకాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ’ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన ఐదు హావిూల్లో ఒకటైన ’గృహలక్ష్మీ’ పథకాన్ని ఈరోజు ప్రారంభించాం. ఈ పథకం కింద బిపిఎల్‌ కుటుంబాల్లోని మహిళా పెద్దలకు నెలకు రెండు వేల రూపాయల్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోట్లాది మహిళలకు తమ బ్యాంక్‌ అకౌంట్లలో రెండువేల రూపాయల్ని ప్రభుత్వం జమ చేసింది. ట్యాబ్‌పై ఒక్క క్లిక్‌తోనే కోట్లాది మంది మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయి. ప్రతినెలా మహిళల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ అవుతాయని రాహుల్‌ అన్నారు.  ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ గానీ, నేతలు గానీ ఏదైనా చెబితే.. కచ్చితంగా వాటిని అమలు చేస్తాం అని అన్నారు. అలాగే ఎన్నికల క్యాంపెయిన్‌లో మహిళలు బస్సు ప్రయాణానికి ఎలాంటి చెల్లింపులు లేకుండా..’శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పాం. ఆ హావిూని కూడా నెరవేర్చాం అని రాహుల్‌ గాంధీ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు వాగ్దానాల్లో నాలుగు హావిూలు మహిళలకు సంబంధించినవే. ఎంతో లోతైన ఆలోచనతోనే ఈ హావిూల్ని ఇచ్చాం అని రాహుల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సంక్షేమ పథకం ఇది. 1.28 కోట్ల కుటుంబ మహిళా పెద్దలకు ఈ పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని అన్నారు. కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు హావిూలు కేవలం పథకాలే కాదని, సమర్ధవంతమైన పాలనకు నమూనా అని రాహుల్‌ గాంధీ అన్నారు. ఐదు హావిూల్లో ఒక్కటి మినహా నాలుగు హావిూలు మహిళా సాధికారతకు ఉద్దేశించినవేనని చెప్పారు.  గృహలక్ష్మి పథకం ద్వారా 1.28 కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హావిూలను తూచ తప్పకుండా అమలు చేయాలనే రాజకీయ సంకల్పం తమ ప్రభుత్వానికి ఉందన్నారు. తాము ఇచ్చిన ఐదు హావిూల అమలుకు రూ.50,000 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు.