మహిళలకు నెలకు రూ.1500
` అధికారంలోకి రాగానే కుల గణన.. రైతు రుణాల మాఫీ
` రూ. 500కే సిలిండర్
` మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు
భోపాల్(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్ నిర్వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. మంగళవారం బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సాగర్‌లో ఒక బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిఫార్సు మేరకు మంజూరైన బుందేల్‌ఖండ్ ప్యాకేజ్‌ని రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం అమలుచేయలేదని ఆరోపించారు. హింసాకాండతో తల్లడిల్లిన మణిపూర్ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఖర్గే ఆరోపించారు.ఈ నెల మొదట్లో రూ. 100 కోట్ల వ్యయంతో షెడ్యూల్డు కులాల ఆరాధనీయుడు సంత్ రవిదాస్ స్మారకం, ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఖర్గే ప్రస్తావిస్తూ సాగర్‌లో సంత్ రవిదాస్ ఆలయానికి శంకుస్థాపన చేసిన మోడీ ఢల్లీిలో సంత్ రవిదాస్ ఆలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలోనే సంత్ రవిదాస్ పేరును ప్రధాని మోడీ గుర్తు చేసుకుంటారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వాగ్దానం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తాం. రూ.500కే ఎల్‌పీజీ సిలెండర్ ఇస్తాం. మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు చేస్తాం. 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన చేపడతాం. ప్రస్తుతం మా వర్కింగ్ కమిటీలో 6 మంది బీసీలు ఉన్నారని ఖర్గే తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారంలోకి వచ్చిందని ఖర్గే విమర్శించారు. బీజేపీ మా ఎమ్మెల్యేలను దొంగిలించారు. పైకి మాత్రం సొంత సిద్దాంతాల విూద ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెబుతుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్లలో ఏం చేసిందని నిలదీస్తుంటారు. మేము రాజ్యాంగాన్ని రక్షించాం అని ఖర్గే చెప్పారు. పరోక్షంగా మోదీని ప్రస్తావిస్తూ, ఆయన ఎలా ప్రధాని అయ్యారని ప్రశ్నించారు. ఈడీని చూపించి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని, కర్ణాటక, మణిపూర్‌లలో కూడా జరిగింది అదేనని అన్నారు. ఎక్కడ అధికారం కోల్పేతే అక్కడ ఇలాంటి పనులే చేసి వాళ్లు అధికారంలోకి వస్తుంటారని విమర్శించారు. కొందరు వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని ఖర్గే అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 140 కోట్ల మంది కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు. హింసతో అట్టుకుడుకుతున్న మణిపూర్‌కు మోదీ చేసిందేవిూ లేదని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌లో దళితుల జనాభా 1.13 కోట్లుగా ఉంది. ఈశాన్య మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఎస్‌సీలకు 6 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. మొత్తంగా 26 అసెంబ్లీ సీట్లు ఈ ప్రాంతంలో ఉండగా, గత ఎన్నికల్లో బీజేపీ 15, కాంగ్రెస్ 9, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు చెరో సీటు గెలుచుకున్నాయి. కాగా, ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.