మహిళలు కుటీర పరిశ్రమలపై దృష్టి సారించాలి : స్పీకర్‌ నాదెండ్ల

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంగళవారం బాల్కొండ మండల కేంద్రంలో 2.87కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్పీ, ఎస్టీ, బీసీ సమీకృత వసతి గృహాన్ని స్పీకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహిళలు కుటీర పరిశ్రమపై దృష్టి పెట్టాలని అన్నారు. ముఖ్యంగా పాలపరిశ్రమలపై వైపు దృష్టి ఉంచాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం వల్ల అసెంబ్లీలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజా ప్రతినిధుల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాల, వసతి గృహం నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ అక్షరాస్యత సాధించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రతి జిల్లాలకు రాష్ట్ర బడ్జెట్‌లో 6వందల నుంచి 7వందల కోట్ల వరకు బడ్జెట్‌లో  కేటాయిస్తున్నారని, ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ అనిల్‌, ఎంపీ  మధుయాష్కీ గౌడ్‌, కలెక్టర్‌ క్రిస్టినా, అధికారులు విక్రమ్‌జిత్‌  దుగ్గల్‌ తదితరులు పాల్గొన్నారు.