మహిళలు కొంగు నడుముకు చుడితే స్వచ్ఛ భారత్‌

5

– బస్తీ సమస్యలపై కమిటీ

– ప్రతి నెల మీటింగ్‌

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి):

స్వచ్చ హైదరాబాద్‌కు మహిళలు బాగస్వామ్యం కావాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. మహిళలు కొంగు నడుంకు బిగించి ముందుకు రావాలన్నారు. తమ ఇల్లును, పిల్లలను ఎంతగా శుభ్రంగా ఉంచుకుంటారో మన వీధులను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇది కేవలం మహిళల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ బృందాలను దేశంలోని ఢిల్లీ, నాగ్‌పూర్‌ నగరాలను పరిశీలించేందుకు పంపించానని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందని వెల్లడించారు. నాగ్‌పూర్‌లో గతంలో వెయ్యి చెత్త కుండీలు ఉండేవని కానీ ఇవాళ ఆ సంఖ్య వందకు చేరిందని వివరించారు. ఇవాళ నాగపూర్‌ సుందర నగరంగా మారిందని తెలిపారు. మనం కూడా మన  నగరాన్ని చెత్త కుండీలు లేని నగరంగా మార్చుకోవచ్చని తెలిపారు. ఇందుకు మహిళలు నడుం బిగించాలని కోరారు. మహిళలు ఇందుకు పూనుకుంటే ఇది తప్పకుండా సాధ్యమవుతుందని అన్నారు. బుధవారం సిఎం స్వచ్చ ఐదారబాద్‌ కార్యక్రమంలో భాగంగా ఫార్సిగుట్టలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తడి,పొడి చెత్తవేరుగా సేకరించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇందు కోసం పదిహేను రోజుల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు చెత్త బుట్టాలు సరఫరా చేస్తారని, వాటిలో ఒక దానిలో తడి చెత్త మరొక దానిలో పొడి చెత్త వేసి మున్సిపల్‌ పారిశుద్య సిబ్బంది విజిల్‌ వేస్తూ వచ్చినపుడు వారి వాహనాల్లో వేయాలని కోరారు. నెల రోజుల్లో సిటీ అంతటా సుమారు 2 వేల 5 వందల మున్సిపల్‌ ఆటోలు చెత్త సేకరించేందుకు తిరుగుతాయని మహిళలంతా చెత్తను ఆ వాహనాల్లో వేయాలని సూచించారు. అయితే ఇన్నేళ్లు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదని మనమంతా కృషి చేస్తే త్వరలోనే నగరం పరిశుభ్రంగా మారుతుందని తెలిపారు. అందరం కలిసి ముందుకు పోదామని పిలుపునిచ్చారు. ఈ సమస్యను అధిగమంచాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదన్నారు.  పార్శీగుట్ట మధురానగర్‌లో స్వచ్ఛహైదరాబాద్‌ అమలు తీరును పరిశీలించి అధికారులు, ప్రజలతో సవిూక్షించారు. స్వచ్ఛహైదరాబాద్‌పై ప్రతి నెల 10వ తేదీన సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలను పారిశుద్ధ్య కార్మికులు ఇస్తారని.. ఇంట్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసి వారికి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. చెత్తను సేకరించి విద్యుదుత్పత్తి, ఎరువుగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

డబుల్‌ బెడ్‌ ఇళ్లు కట్టించి తీరుతా

హైదరాబాద్‌లో 379 కిలోవిూటర్ల మేర నాలాలు ఉన్నాయని.. నాలాలపై నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్న ప్రజలకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు కట్టిస్తామని హావిూ ఇచ్చారు. తాను పేదలకు ఓయూ భూముల్లో ఇళ్లు కట్టిస్తానంటే నన్ను విమర్శలు చేస్తున్నారని అంటూ, అయినా ఇళ్లు కట్టించే పనిలో వెనక్కి పోమన్నారు. మొన్న ఐదు రోజులపాటు నగరంలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజల సమస్యలను తెలుసుకున్నామని సీఎం అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం తర్వాత నగరంలోని బస్తీల బాగు కోసం ఏం చేయాలి, ఏం చర్యలు చేపట్టాలి అనే వాటిపై ఒక అవగాహనకు వచ్చామని వెల్లడించారు. ప్రపంచంలో పేరున్న నగరం హైదరాబాద్‌ అని అన్నారు. నగరంలో వందల సంఖ్యలో నాలాలు ఉన్నాయని చిలకలగూడలో ఉన్న నాలా లాంటి వాటిపై చర్చించామన్నారు. నాలాలపై పేదలు ఇండ్లు కట్టుకుని అశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కోసం ప్రభుత్వమే పక్కా ఇండ్లు కట్టించి ఇస్తుందని ప్రకటించారు. ఇందు కోసం చిలకలగూడలో ఉన్న రైల్వే భూముల్లో పది ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించామని, రైల్వే శాఖతో చర్చిస్తామని అన్నారు. ఇళ్లు లేని పేదలందరికి ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా తాను ఇక్కడికి వస్తానని అన్నారు. ప్రతి నెల 17న స్వచ్ఛ కమిటీ సమావేశం కావాలని తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. స్థానికుల వినతిపత్రాలను ఆయనే స్వయంగా తీసుకుని అధికారులకు అందించారు.

గల్లీ సమస్యలపై ప్రతినెలా సమావేశం

స్వచ్ఛ హైదరాబాద్‌ వల్లే గల్లీ సమస్యలను గుర్తించగలిగామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రతి నెల 17న స్వచ్ఛ హైదరాబాద్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇకపై నిర్మాణాలన్నీ పద్దతి ప్రకారమే జరగాలన్నారు. హైదరాబాద్‌లో 379 కిలోవిూటర్ల మేర నాలాల ఉన్నాయన్నారు. నాలాలపై కట్టుకున్నవారికి వేరే చోట డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు.  మధురానగర్‌ రాఘవ గార్డెన్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌తోపాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్‌ భాగంగా సీఎం కేసీఆర్‌ తోపాటు ఆయన సహచర మంత్రులు కూడా నగరంలో పర్యటిస్తున్నారు. మన హైదరాబాద్‌ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు నగరవాసులందరు కృషి చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు. నగరంలో నిర్మాణాలు క్రమ పద్ధతిలో జరగాలని తెలిపారు. ఈ సందర్భంగా బస్తీ కమిటీని సెం ఎసిఆర్‌ ప్రకటించారు.