మహిళలు సత్తా చూపాలి : కలెక్టర్‌ క్రిస్టినా

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30 :  మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని కలెక్టర్‌ క్రిస్టినా అన్నారు.  వీరు అన్ని రంగాల్లో రాణించడానికి కృషి చేయాలని ఆమె తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మహిళల హక్కులపై మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఉన్నత చదువులు చదివి వాటికి తగ్గట్టుగా ఉద్యోగాలు చేస్తూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని సూచించారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా బాహ్యప్రపంచంలో తమ సత్తా ఏమిటో చాటాలన్నారు. కుటుంబసభ్యులు, భర్తలు  మహిళలకు సహకరిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. యుక్తవయసు రాకముందే మహిళలకు వివాహాలు చేయవద్దని ఇది మంచి పద్దతి కాదని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. మహిళలకు వివాహం కోసం చూయించే శ్రద్ద, చదువు, ఉద్యోగాల విషయంలో చూయించాలన్నారు. సమావేశానికి ముందు కలెక్టర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతూ సమస్యలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికలాంగులతో మాట్లాడారు. తమకు ట్రైసైకిళ్లు మంజూరు చేయాలని పలువురు వికలాంగులు కలెక్టర్‌ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌ అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ వెంట ఆయా శాఖల అధికారులు, స్థానిక ఎస్సై నవీన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.