మహిళాసాధికారతను సాకారం చేశాం

రిజర్వేషన్లు లేకున్నా పదవులిచ్చి గౌరవించాం
అన్ని రంగాల్లో 51శాతం పదువుల ఇచ్చిన ఘనత తమదే
వివిధ పథకాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేశాం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్‌
విజయవాడ,మార్చి8(జనం సాక్షి): మహిళాసాధికారితకు అర్థం చెప్పి, వారికి పదవులిచ్చి గౌరవించగన ఘనత తమదని సిఎం జగన్‌ అన్నారు. మహిళలకు 51శాతం పదవులిచ్చిన తొలి ప్రభుత్వం వైసీపీ అని,
1356 పదవుల్లో 51 శాతం మహిళలకే ఇచ్చామన్నారు. రెండున్నర ఏళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా మహిళలు ఇక్కడికి వచ్చారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు హ్యాపీ ఉమెన్స్‌ డే చెప్పారు. ఆధునిక ఏపీలో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులేనన్నారు. ఇక్కడ మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్‌రైన్డ్‌ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయన్నారు. మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలరని ఐన్‌రైన్డ్‌ అన్నారని జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ తన ముందున్నవారిలో 99 శాతం మంది మహిళలు ఏదో ఒక పదవిలో ఉన్నారని,భారతదేశ మహిళా సాధికారత చరిత్రలోనే ఇంతమంది మహిళా ప్రజా ప్రతినిధుల సమావేశం ఎక్కడా ఎప్పుడూ జరగలేదన్నారు. 1993 నుంచీ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కు పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారని కానీ అది ముందుకు సాగలేదన్నారు. కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.982 కోట్లు సాయం చేశామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 34 నెలల కాలంలో మహిళల చేతికి రూ.లక్షా 18 వేల కోట్లు అందించామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్‌ నియామకం విప్లవాత్మక మార్పు అని అన్నారు. డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవులు కూడా మహిళలకే ఇచ్చామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 51 శాతం మహిళలే పనిచేస్తున్నారని సీఎం తెలిపారు.
31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన కల్పించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని తెలిపారు. విద్యా దీవెన ద్వారా రూ.6,260 కోట్లు నేరుగా అందించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1800 కోట్లు కూడా చెల్లించామని తెలిపారు. ఇలాంటి పథకాలు గత ప్రభుత్వం ఏనాడు అమలు చేయలేదని అన్నారు. సంపూర్ణ పోషణ పథకం ద్వారా 34.16లక్షల మంది మహిళలకు మేలు చేకూరుతోందని తెలిపారు.
సంపూర్ణ పోషణ పథకానికి రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్‌, దిశ పీఎస్‌లు తీసుకొచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌
రూపొందించామని పేర్కొన్నారు. కోటి 13 లక్షల మంది మహిళలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. వైఎస్సార్‌ ఆసరా వడ్డీ పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. వాలంటీర్లుగా 53 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటివరకు రూ.13వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ చెల్లిస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,354కోట్లు నేరుగా జమ చేశామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 9,180 కోట్లు సాయం అందించామని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన చేతిలో పెన్షన్‌ పెడుతున్న ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు. మహిళలకు 51 శాతం పదవులు కేటాయించాలని చట్టం చేశామని తెలిపారు. మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదేనని అన్నారు.జడ్పీ ఛైర్‌ పర్సన్‌లుగా 54శాతం మంది మహిళలే ఉన్నారని అన్నారు. 13 జడ్పీ చైర్మన్‌లతో ఏడుగురు మహిళలేనని తెలిపారు. మహిళలకు
51 శాతం పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లుగా 64 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఏ మహిళకు దక్కని గౌరవం ఏపీ మహిళలకు దక్కిందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. మహిళలను సీఎం జగన్‌ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్‌ లాంటి మహిళా పక్షపాతి.. దేశంలోనే ఉండరని తెలిపారు. నారీ భేరీ సౌండ్‌.. నారావారి కర్ణభేరిలో రీసౌండ్‌ రావాలని అన్నారు. సీఎం జగన్‌ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారని తెలిపారు. సీఎం జగన్‌ మహిళలను మహారాణులను చేశారని గుర్తుచేశారు. మహిళ బావుంటే, కుటుంబం బావుంటుందని నమ్మే వ్యక్తి.. సీఎం జగన్‌ అని అన్నారు. సీఎం జగన్‌ మహిళలందరికీ దేవుడితో సమానమని రోజా తెలిపారు. మహిళ సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేయాలనేది మహానేత వైఎస్సార్‌ కల అని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధనకు సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మహిళలను దగా చేశారని తెలిపారు. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, ఎంపీలు బీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గొట్టేటి మాధవి, మహిళా కవిూషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు రోజా, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్‌ ఉప్పాల హారిక, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పలు కార్పొరేషన్ల ఛైర్‌ పర్సన్లు, డైరెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.