మహిళా ప్రొఫెసర్‌పై చర్య ఎందుకు తీసుకోరూ?

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 : తెలంగాణ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలని  కోరుతూ స్థానిక కంఠేశ్వర్‌ నగర్‌లో శుక్రవారం నాడు ఎబివిపి రాస్తారోకో చేపట్టింది. ఎబివిపి నగర కార్యదర్శి వాసు మాట్లాడుతూ తెలంగాణపై ఆమె ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం విద్యార్థులు బలిదానాలు ఇస్తుంటే దానిని ఆమె హేళనగా మాట్లాడటం విచారకరమని అన్నారు. వైస్‌ ఛాన్సలర్‌ కూడా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని వాసు అన్నారు. తెలంగాణను ప్రభుత్వం తక్షణం ప్రకటించాలని కోరుతూ అరగంట సేపు రాస్తారోకో చేపట్టారు. దీనితో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.