మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
` మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌..
` నేడు రాజ్యసభ ముందుకు
` ఇక్కడ ఆమోదం పొందితే ఫలించనున్న మూడు దశాబ్దాల కల
ఢల్లీి(జనంసాక్షి):చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సెప్టెంబర్‌ 19న ప్రవేశపెట్టగా.. బుధవారం దీనిపై చర్చ జరిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చ అనంతరం.. న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్‌ జరిగే ప్రక్రియపై లోకసభ సెక్రటరీ జనరల్‌ వారికి వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే ‘ఎస్‌’ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై ‘నో’ అని రాయాలని చెప్పారు. అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టారు. ఓటింగ్‌కు కొద్దిసేపటి ముందు ప్రధాని మోదీ సభలోకి వచ్చారు. కాగా లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ సైతం ఇది ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండిరగులో ఉన్న ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే.. మూడు దశాబ్దాల ప్రయత్నం చివరకు ఫలించినట్లు అవుతుంది.