మహిళా బిల్లు చరిత్రాత్మకం

మహిళా బిల్లు చరిత్రాత్మకం

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందటం అఖిల భారతావనిలో అత్యుత్తమమైన పరిణామమని, దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం అని పలువురు మహిళా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు మహిళా బిల్లుపై వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. దేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తమిళనాడులో కనిమొళి లాంటి మహిళామణుల పోరాటం వృథా కాలేదని, వారు చేసిన కృషికి కృతజ్ఞులమని ఆ విద్యావేత్తలు అన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం చరిత్రలో మర్చిపోని ఘట్టమని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని పెంచేలా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్‌, కళ్యాణ లక్ష్మీ, ఒంటరి మహిళలకు ఆర్థికంగా చేయూత, మహిళా సాధికారతకు కృషి చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మహిళలకు ఇబ్బందులు లేకుండా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించి, స్థానిక ఎన్నికలు, నామినేటెడ్‌ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతున్నదని విద్యావేత్తలు పేర్కొన్నారు.