మహిళా బైక్ రైడర్ పాలివల్ మృతి

333మధ్యప్రదేశ్ : దేశంలో టాప్‌ మహిళా బైక్‌ రైడర్ వీను పాలివల్‌(44) మృతి చెందారు. తాను ఎంతగానో ప్రేమించే బైక్ రైడ్ చేస్తూనే పాలివల్ తుదిశ్వాస విడిచారు. పాలివర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బైక్ రైడర్స్ ను తీవ్రంగా కలచివేసింది. మధ్యప్రదేశ్‌లోని విదీషా జిల్లాలో సోమవారం సాయంత్రం పాలివల్ తన తోటి బైక్‌ రేసర్‌ దీపేశ్‌ తన్వర్‌తో కలిసి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై టూర్‌కి వెళ్లింది.

భోపాల్ కి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యారాస్‌పూర్‌ ప్రాంతంలో పాలివల్ బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పాలివల్ తీవ్ర గాయాలపాలైంది. తీవ్రంగా గాయపడిన పాలివల్ ను దీపేశ్ గ్యారాస్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విదీషా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పాలివల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌లపై గంటకు 180 కిమీల ప్రయాణం చేయడం వీను ప్రత్యేకత. దేశ వ్యాప్తంగా తాను చేపట్టిన బైక్‌ జర్నీని వీను డాక్యుమెంటరీ తీయాలనుకుంది. కానీ ఇదే ఆమె చివరి యాత్రగా మిగిలింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.