మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
` ఇది సాధారణ చట్టం కాదు.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనం : మోదీ
న్యూఢల్లీి(జనంసాక్షి):మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మహిళా బిల్లుపై రాజ్యసభలో 10 గంటలకు పైగా చర్చ జరిగింది. ఇప్పటికే లోక్‌సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. కొత్త పార్లమెంటులోని లోక్‌సభలో తొలిసారి ఆమోదం పొందిన బిల్లు ఇదే కావడం విశేషం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈనెల 19న ప్రవేశపెట్టిన బిల్లుపై బుధవారం నాడు చర్చ చేపట్టారు. సుమారు 8 గంటల సేపు చర్చ అనంతరం దీనిపై ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది ఎంపీలు ఓటు వేయగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యాంగ బిల్లు కావడంతో మాన్యువల్ పద్దతిలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఈ ఓటింగ్‌ను నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్పిప్పులను సభ్యులందరికీ అందజేశారు. ఓటింగ్ విధానాన్ని కూడా ఆయన వివరించారు. బిల్లుకు ఆమోదం తెలిపిన పక్షంలో ఆకుపచ్చ కాగితంపై ’ఎస్’ అని రాయాలి. వ్యతిరేకించే వారు ఎరుపు రంగు స్లిప్‌పై ’నో’ అని రాయాల్సి ఉంటుంది. ఓటింగ్ అనంతరం బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినట్టు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. కాగా, లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును ఈనెల 21న రాజ్యసభలో ప్రవేశపెడతారు. వెంటనే బిల్లుపై చర్చ జరిపి అదేరోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఉభయసభల ఆమోదం పొందిన వెంటనే బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.
ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది: మోదీ
దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.ఇది సాధారణ చట్టం కాదని.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బలమైన ప్రభుత్వం ఆవశ్యకతను చాటిచెప్పిన ప్రధాని.. దీని ద్వారానే ఎన్నో ఏళ్లుగా పెండిరగులో ఉన్న బిల్లు ఆమోదం పొందిందన్నారు. ఈ నేపథ్యంలో ‘భాజపా మహిళా మోర్చా’ సత్కార కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహిళా నేతలకు వినమ్రంగా నమస్కరించారు.’మహిళలకు రిజర్వేషన్ల అంశం దాదాపు మూడు దశాబ్దాలుగా నానుతూ వచ్చింది. గత పాలకులకు ఈ బిల్లుపై చిత్తశుద్ధి కరవైంది. అయితే, భాజపా ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేసింది. ఈ క్రమంలోనే దశాబ్ద కాలంలో మహిళలు ఒక శక్తిగా ఎదిగారు. అందుకే.. గతంలో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను చింపేసిన రాజకీయ పార్టీలే నేడు మద్దతివ్వాల్సి వచ్చింది’ అని ప్రధాని మోదీ అన్నారు. పూర్తి మెజారిటీ ఉన్న బలమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం పదేళ్ల కాలంలో వివిధ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు లోక్‌సభలోనూ బిల్లుకు ఆమోదం లభించింది. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం పార్లమెంటరీ చరిత్రలో సువర్ణ ఘట్టమని ప్రధాని మోదీ అభివర్ణించారు.