ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

మహేశ్‌బాబుకు లేఖ రాసి..
ఆత్మహత్య చేసుకోబోయే ముందు తమ తల్లిదండ్రులకో లేదంటే సన్నిహితులకో సూసైడ్ నోట్ రాసి, చావుకి కారణాలు తెలియజేస్తుంటారు. కానీ ఓ విద్యార్థి తన తల్లిదండ్రులతో పాటు తన అభిమాన హీరో మహేష్ బాబుకి కూడా సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ క్యాంపస్‌లో సునంద్ కుమార్ రెడ్డి(21) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తమ అవసరాలకే వాడుకుంటారని, బంధుత్వ వ్యవస్థ తనకు నచ్చలేదని తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లేఖలో సునంద్ తెలిపాడు. మహేష్‌కు రాసిన లేఖలో ఆయనను తన డాక్టర్‌గా పేర్కొన్నాడు.
గుంటూరు జిల్లా సిద్ధార్థ్ నగర్‌కు చెందిన పులి శ్రీనివాసరెడ్డి, మయూరిల చిన్న కుమారుడే సునంద్ కుమార్ రెడ్డి. గచ్చిబౌలిలో కంప్యూటర్ సైన్స్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్‌లోని 267 గదిలో ఉంటున్నాడు. మూడు, నాలుగు రోజులుగా ముభావంగా ఉంటున్నాడని స్నేహితులు తెలిపారు. . సడెన్‌గా బుధవారం రాత్రి అతని స్నేహితుడు సాయి సాహిత్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మళ్లీ గురువారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సునంద్ గదికి వెళ్లి చూడాలని మరో స్నేహితుడు రోహిత్‌కు చెప్పాడు. రోహిత్ ఉదయం 11:30కి వెళ్లి చూడగా సునంద్ గది లోపల గడియబెట్టి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో సెక్యూరిటీ సమాచారం అందించాడు రోహిత్. సెక్యూరిటీ వచ్చి గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సునంద్ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. అతని ఆత్మహత్యకు చదువు కారణం కాదని పోలీసులు చెబుతున్నారు.
సునంద్ గదిలో పోలీసులకు రెండు లేఖలు లభ్యమయ్యాయి. ఒక లేఖలో ‘‘అమ్మానాన్న.. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి. మీరంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మీ తరుపున బంధువులంటే నాకు ఇష్టం లేదు. వారు కేవలం అవసరానికి వచ్చి వెళ్లేవారు. భారతీయ బంధుత్వ వ్యవస్థ బాగా లేదు’’ అని ఒక లేఖలో పేర్కొన్నాడు.
మరో లేఖను సూపర్ స్టార్ మహేష్ బాబు పేరిట రాశాడు. ‘‘మహేష్.. యూ ఆర్ మై డాక్టర్. నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మీ సినిమాలే చూస్తాను. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మీరే నా డాక్టర్. మీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు’’ అని రాశాడు. సునంద్ గది నిండా మహేష్ ఫోటోలు ఉన్నాయి. మహేష్ బాబుకు సునంద్ చాలా పెద్ద అభిమాని అని అతని స్నేహితులు తెలిపారు.