మాంసం నిషేధంపేరా మనిషిని హత్య చేస్తారా?
– మానవత్వం మరిచిన మతోన్మాదంపై పెల్లుబికుతున్న నిరసన
హైదరాబాద్ అక్టోబర్2(జనంసాక్షి):
మాంసం నిషేధం పేరిట మతతత్వశక్తులు మారణ¬మం సృష్టిస్తున్నాయి. గోమాంసం తిన్నారన్న కారణంతో దాద్రీలో ఓ మనిషిని సాటి మనుషులే కొట్టి చంపారు. మతమౌఢ్యం పరాకాష్ఠకు చేరిన ఈ ఘటన దేశ రాజధానికి అత్యంత సవిూపంలో జరిగింది. ఈ దారుణానికి ఆర్‌ఎస్‌ఎస్-బిజెపిలే కారణమని దేశ వ్యాప్తంగా నిరసన పెల్లుబికుతుంది.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మతతత్వ శక్తులు రెచ్చిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఆవును వధించి దాని మాంసం తిన్నాడన్న నెపంతో గ్రేటర్ నోయిడా పరిధిలోని బిసాడా గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబంపై కొందరు దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనలో 58 ఏళ్ల ఇఖ్లాక్ మృతి చెందగా, అతడి కుమారుడు 21 ఏళ్ల డానిష్ మృత్యువుతో పోరాడుతున్నాడు.బిసాడాలో జరిగిన దారుణంపై సిపిఎంతో సహా పలు రాజకీయ పార్టీలు
తీవ్రంగా స్పందించాయి.శుక్రవారం సీపిఎం కేంద్ర కమిటి సభ్యురాలు బృందాకారత్ బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. కుటుంబసభ్యులను ఓదార్చింది. ఈ ఘటనకు ఆర్‌ఎస్‌ఎస్-బిజెపియే కారణమని స్పష్టం చేసింది. మోది అధికారంలోకి వచ్చాక విూట్ బ్యాన్ పేరిట దేశవ్యాప్తంగా మతతత్వ శక్తుల ఆగడాలు పెరిగిపోయాయని పేర్కొంది. ప్రశాంతంగా ఉన్న బిసాడాలో మతతత్వశక్తులు చిచ్చు పెట్టాయని ధ్వజమెత్తింది. దీనిపై ప్రధాని ఎందుకు మౌనం వీడడం లేదని ప్రశ్నించింది.
బిసాడాలో జరిగిన ఘోరంతో ఇఖ్లాక్ భార్య, కుమార్తె, బంధువులు షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. తాము ఈ గ్రామంలో ఉండలేమని బోరున విలపిస్తున్నారు. బాధిత కుటుంబంతో పాటు పలు ముస్లిం కుటుంబాలు బిస్వాడా గ్రామాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే స్థానిక అధికారులు వారికి నచ్చజెప్పారు. ముస్లిం కుటుంబాలకు ఎలాంటి హాని జరగకుండా భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు ఇఖ్లాక్ మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం సమాజం డిమాండ్ చేస్తోంది. శాంతి భద్రతలు కాపాడడంలో సమాజ్‌వాది ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం- మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించింది. బాధితుల ఇంట్లో లభించిన మాంసాన్ని ఆవు మాంసమా కాదా…అనేది నిర్ధారించేందుకు పరీక్షలకు పంపింది. గోహత్యపై నిషేధం ఉందని, హిందువుల మనోభావాలు గౌరవించాలని బిజెపి చెబుతోంది.