మాకొద్దీ తెల్లదొరతనం అటూ నినదించిన గరిమెళ్ల

బ్రిటిషర్లకు వణుకు పుట్టించిన ఆనాటి పాట
జాతీయ కవి ` గరిమెళ్ల సత్యనారాయణ జయంతి

శ్రీకాకుళం,జూలై14(జనం సాక్షి): తెల్లదొరలను వణికించిన తెలుగు పాట..స్వాతంత్యోద్యమ్రం ఉధృతంగా సాగుతున్న రోజులవి. స్వాతంత్య సమర యోధులపై బ్రిటిష్‌ పాలకుల దమనకాండ దారుణంగా కొనసాగుతున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఒక సామాన్యమైన తెలుగు కవి తెల్లదొరల అరాచకాలను తెగనాడుతూ గొంతెత్తాడు. ఆయన కలం నుంచి జాలువారిన తెలుగు పాట..తెల్లదొరల వెన్నుల్లో వణుకు పుట్టించింది. ఆ పాట తెలుగునాట నలుచెరగులా మార్మోగింది. మాకొద్దీ తెల్లదొరతనము.. దేవా.. మా కొద్దీ తెల్లదొరతనము..‘ అనే పాట రాసిన ఆ కవి గరిమెళ్ల సత్యనారాయణ. ‘పన్నెండు దేశాలు పండుచున్నగాని ప్టటెడన్నము లోపమండి…ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తింటామండి…‘ అంటూ ఆ పాటలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఆయన పాడుతుంటే ఆబాల గోపాలమూ గొంతు కలిపేవారు. ఉద్యమావేశంతో ఉర్రూతలూగిపోయేవారు జనాలను ఉర్రూతలూగించే కవి గాయకుడు జనంలో ఉంటే తమ ఉనికికే ముప్పు తప్పదని తలచిన బ్రిటిష్‌ పాలకులు ఆయనను అరెస్టు చేసి, జైలుకు పంపారు.’సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’అనే జాషువా మాట గరిమెళ్ల సత్యనారాయణకు అక్షరాలు అతికినట్లుగా సరిపోతుంది.? చిరకాలం ప్రజల నాల్కల విూద నర్తించే పాటనురాసిన గరిమెళ్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వెంకట నరసింహం,స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రిలలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింది. స్వాతంత్యోద్య్రమం ఉధృతంగా సాగుతున్న కాలంలో కలకత్తాలో 1920లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా। సహాయ
నిరాకరణోద్యమం మొదలైంది. ఆ స్ఫూర్తితోనే గరిమెళ్ల వీరావేశంతో ఉద్యమంలోకి దూకారు. ’మాకొద్దీ తెల్లదొరతనము..‘ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ గుమిగూడి, ఆయనతో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఏ స్థాయిలో జనాలను ప్రభావితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్‌ కలెక్టర్‌ తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడిరచుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా,ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు.ఆయన జైలు పాలైనా, కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీ టోపీలు ధరించి ’మాకొద్దీ తెల్లదొరతనము..’ అని పాడుకుంటూ ఊరూరా కవాతులు సాగించారు. శిక్ష పూర్తయ్యాక విడుదలైన గరిమెళ్ల మళ్లీ జనం మధ్యకు వచ్చి, ఎలుగెత్తి పాడటం మొదలు పెట్టారు. గరిమెళ్ల బయట ఉండటం ప్రభుత్వానికి క్షేమం కాదని తలచి మళ్లీ ఆయనను అరెస్టు చేశారు. రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. గరిమెళ్ల జైలులో ఉండగా, 1923లో ఆయన తండ్రి మరణించారు. అప్పుడు బ్రిటిష్‌ అధికారులు ఆయన ముందుకు ఒక ప్రతిపాదన తెచ్చారు. అదేమిటంటే క్షమాపణ చెప్పి, బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ పాట పాడకుండా ఉంటే వెంటనే విడుదల చేసేస్తామన్నారు. గరిమెళ్ల అందుకు అంగీకరించలేదు శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు జైలులో ఉండటానికే సిద్ధపడ్డారు.జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల ఆయనకు ఘన సన్మానాలు చేశారు. .స్వాతంత్యోద్యమ్ర కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు. చివరి దశలో ఆయనకు ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. దుర్భర దారిద్య పరిస్థితులతో పోరాడుతూనే ఆయన 1952 డిసెంబరు 18న తుదిశ్వాస విడిచారు.