మాజీ ఎమ్మెల్యే పులపర్తి హఠాన్మరణం

సంతాపం తెలిపిన రాజకీయప్రముఖులు

కోనసీమ,జూలై7(  జనంసాక్షి): ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నారాయణ మూర్తికి భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగిగా ఉన్న ఆయన రాజకీయాల్లో చేరి ప్రజాసేవకు అంకితమయ్యారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నారాయణమూర్తి మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. నారాయణమూర్తి కుటుంబానికి సానుభూతి తెలిపారు. పీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణకు గురువారం గుండెపోటు రావడంతో అమలాపురంలోని దవాఖానలో చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1996 ఉప ఎన్నికల్లో నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004 లో ఈ స్థానం పొత్తుల్లో బీజేపీకి ఇవ్వడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో తిరిగి టీడీపీ నుంచి పీ గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్‌ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ నుంచి కూడా తప్పుకున్నారు. నారాయణ మూర్తి హఠాన్మరణంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అనుచరులు, పి.గన్నవరం నేతలు పులపర్తికి నివాళులర్పించారు. నగరం, పీ గన్నవరం నియోజకవర్గాల ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన అతికొద్ది మందిలో ఒకరిగా నారాయణ మూర్తి నిలిచారని నివాళులర్పించారు.