మాజీ ప్రధాని నెహ్రూకు ఘన నివాళులు

– ట్విటర్‌లో నివాళులర్పించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, నవంబర్‌14 (జనంసాక్షి) : దివంగత ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్‌ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహణ్‌ సింగ్‌, మాజీ ఉప రాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, పులువురు నాయకులు, ప్రముఖులు న్యూఢిల్లీలోని శాంతివనంలో నెహ్రూ సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా జవహర్‌లాల్‌ నెహ్రూకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ సేవలను మోదీ కొనియాడారు. అదేవిధంగా ఏపీలోని విజయవాడ రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి భవిష్యత్తుకు పునాది వేసేలా బాల్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి లక్ష్యాలతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్యం తెచ్చిన మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి ఎందరో మహనీయుల త్యాగాలను పిల్లలకు వివరించారు. ప్రపంచంలోనే ఉత్తమ శక్తిగా ఎదిగే అవకాశం మన దేశానికే ఉందని అన్నారు. మహనీయుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు. అన్నిరంగాల్లో దేశ పురోగాభివృద్ధిలో బాలలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పిల్లలందరికీ బాలాజీ, దుర్గమాత ఆశీస్సులు ఉండాలని దీవించారు.
పిల్లలే మన భవిష్యత్‌ – కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మన పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును విలువైనదిగా భావించి.. వారిని ఆదరించే సమాజాన్ని సృష్టిద్దాం. పిల్లలే మన వర్తమానం.. పిల్లలే మన భవిష్యత్‌ అని ఆమె పేర్కొన్నారు. పిల్లలు అభివృద్ధి చెందే సమాజాన్ని సృష్టిద్దామని కవిత పిలుపునిచ్చారు.