మాజీ మంత్రి జయంతి నటరాజన్‌ ఇంటిపై సీబీఐ దాడులు

దిల్లీ,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కేంద్ర పర్యావరణశాఖ మాజీ 0మంత్రి జయంతి నటరాజన్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైలోని ఆమె నివాసంలో దాడులు చేసి విచారించినట్లు సమాచారం. యూపీఏ2 ప్రభుత్వ కాలంలో రెండు ఉక్కు కంపెనీలకు అక్రమంగా అటవీ భూములను ధారాదత్తం చేశారనే అభియోగాలపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. అధికార దుర్వినియోగం, నేరపూరిత కుట్ర కింద జయంతి నటరాజన్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. దీని దర్యాప్తులో భాగంగానే అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌, జేఎస్‌డబ్ల్యూ లిమిటెడ్‌ కంపెనీలకుగనుల కోసం అక్రమంగా ఝార్ఖండ్‌లోని అటవీభూములను కేటాయించినట్లు తేలడంతో పర్యావరణ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నత అధికారులపై సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసింది.తమిళనాడుకు చెందిన జయంతి నటరాజన్‌ యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో జులై 2011 నుంచి డిసెంబరు 2013 వరకు పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తన నిర్ణయాల్లో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అతి చొరవ చూపిస్తున్నారనే కారణంతో జనవరి 2015లో పార్టీకి రాజీనామా చేశారు.