మాజీ సీఎం ఇంట్లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం

– కాల్చివేసిన భద్రతా సిబ్బంది
– జమ్మూ కాశ్మీర్‌లో ఘటన
జమ్ము, ఆగస్టు4(జ‌నం సాక్షి) : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా నివాసంలో చొరబడిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జమ్ములోని భటింది ప్రాంతంలో గల ఫరూఖ్‌ అబ్దుల్లా నివాసంలోకి శనివారం ఉదయం ఓ వ్యక్తి చొరబడ్డాడు. కారులో వేగంగా వచ్చి ఫరూఖ్‌ నివాసం ప్రధాన ద్వారాన్ని ఢీకొట్టాడు. అనంతరం కారులో నుంచి దిగి ఇంట్లోకి దూసుకెళ్లాడు. భద్రతాసిబ్బంది అడ్డుకున్నా ఆ వ్యక్తి ఆగకపోవడంతో అతడిపై కాల్పులు జరిపారు. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆగంతకుడిని పూంఛ్‌ జిల్లాకు చెందిన ముర్తాజ్‌గా పోలీసులు గుర్తించారు. ముర్తాజ్‌ కుటుంబం ప్రస్తుతం జమ్ములో నివాసముంటోంది. అతడి తండ్రి బన్‌-తలబ్‌ ప్రాంతంలో తుపాకుల ఫ్యాక్టరీ నడుపుతాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఫరూఖ్‌ అబ్దుల్లా శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటనపై ఫరూఖ్‌ తనయుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ‘నాన్న ఇంటి వద్ద జరిగిన విషయం గురించి తెలిసింది. చొరబాటుదారుడు ఇంట్లోని పైఅంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు అతడి గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు’ అని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు.