మాట్లాడుతున్న అధికారులు

నామినేషన్‌ షెడ్యూల్‌, నామినేషన్‌ ఫైలింగ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సురేష్‌

మంచిర్యాల ప్రతినిధి, నవంబర్‌ 11, (జనంసాక్షి) :

నామినేషన్‌ షెడ్యూల్‌, నామినేషన్‌ ఫైలింగ్‌పై తీసుకోవలసిన సూచనలు, జాగ్రత్తలను ఆదివారం స్థానిక రాజస్వ మండల అధికారి కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సురేష్‌ సమావేశం నిర్వహించారు. నామినేషన్‌ షెడ్యూల్‌, నామినేషన్‌ ఫైలింగ్‌, తీసుకోవలసిన జాగ్రత్తలు, జతచేయవలసిన డాక్యుమెంట్లు తదితర వివరాలను రిటర్నింగ్‌ అధికారి వివరించారు. ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు, రాజకీయ పార్టీల వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని, సి-విజిల్‌, ఐ.టి. అప్లికేషన్లపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు నామినేషన్‌ సమర్పించు సమయంలో అఫిడవిట్‌ (ఫారం-26), ప్రమాణపత్రం, నేరచరిత వివరాలను ఫార్మాట్‌ సి-1, సి-2లలో పూర్తి స్థాయిలో పూరించాలని, రాజకీయ పార్టీలకు సంబంధిత అభ్యర్థులు అయితే ఎ, బి ఫారములు అభ్యర్థి స్వయంగా సంతకం చేసినది, ఎస్‌.సి. / ఎస్‌.టి. వారు అయితే తహశిల్దార్‌ జారీ చేసిన కులధృవీకరణ పత్రం, ధృవీకరించిన ఎలక్ట్రోరల్‌ కాపీలు, నూతనంగా తెరిచిన బ్యాంక్‌ ఖాతా వివరాలు, స్టాంప్‌సైజ్‌ ఫొటోలు, సెక్యూరిటీ డిపాజిట్‌, తగు ప్రతిపాదకులు, నోడ్యూ సర్టిఫికెట్‌తో కలిపి నామినేషన్‌ పత్రంలో అన్ని వివరాలు విధిగా పూర్తి చేసి ఈ నెల 12 నుండి 19వ తేదీ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటలలోగా రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలని తెలిపారు. నామినేషన్‌ వేసేందుకు ఫారం-28 రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఒక అభ్యర్థి 4 నామినేషన్లు వేయవచ్చని, 10వేల రూపాయల డిపాజిట్‌ ఉంటుందని, షెడ్యూల్డ్‌ కులము/తెగలకు సంబంధించిన వారికి 5వేల రూపాయల డిపాజిట్‌ ఉంటుందని, గుర్తింపు పొందిన జాతీయ/రాష్ట్ర రాజకీయ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ను అదే నియోజకవర్గంలోని ఓటరుగా నమోదై ఒక్కరు ప్రతిపాదించవచ్చని, రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీల వారు, స్వతంత్య్ర అభ్యర్థుల నామినేషన్లను అదే నియోజకవర్గంలోని 10మంది ఓటర్లు ప్రతిపాదించవలసి ఉంటుందని, రిజిస్టర్‌ కాని స్వతంత్య్ర అభ్యర్థులు నామినేషన్‌ పత్రంలోని ఎన్నికల సంఘం పంపిన ఉచిత గుర్తుల నుండి మూడింటిని ప్రాధాన్యత క్రమంలో వ్రాయవలసి ఉంటుందని, మొదటగా వేయబడిన నామినేషన్లో ప్రాధాన్యత క్రమం పేర్కొన్న గుర్తులను కేటాయింపు కోసం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పోటీ చేసే అభ్యర్థి నియోజకవర్గ ఓటరు కానట్లయితే వారు ఓటరుగా నమోదైన నియోజకవర్గ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి నుండి ధృవీకరించిన ఓటరు జాబితా ప్రతిని తీసుకువచ్చి నామినేషన్‌ వెంట జతపరచాలని, ఎన్నికల ఖర్చులకు సంబంధించి నామినేషన్‌ వేసే అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు 48 గంటల ముందు తన పేరిట నూతన బ్యాంక్‌ ఖాతా ప్రత్యేకంగా తెరువవలసి ఉంటుందని, అంతకు ముందు ఉన్న బ్యాంక్‌ ఖాతాలు అనుమతించబడవని తెలిపారు. బ్యాలెట్‌ పత్రముపై పెట్టేందుకు ఇచ్చిన ఫొటో ఎన్నికల నోటిఫికేషన్‌కు గత మూడు మాసాల లోపు దిగినది అని నిర్ధారించి నిర్ణీత నమూనాలో ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.సి.పి. గౌస్‌బాబా, పట్టణ సి.ఐ. ఎడ్ల మహేష్‌, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు