మాదేశాలకు రండి !

C

మారిషిస్‌, బ్రిటన్లు కేటీఆర్‌కు ఆహ్వనం

హైదరాబాద్‌,మార్చి25(జనంసాక్షి):

తెలంగాణలో ఐటీ రంగాన్ని బలోపేతం చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు విదేశాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. తమ దేశాల్లో పర్యటించాలని మారిషస్‌, బ్రిటన్‌ అధికారుల నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. సంక్షేమం, అభివృద్ధిలో ముందంజలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటుంది. ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీకి తెలంగాణ కేరాఫ్‌గా మారింది. కేటీఆర్‌ విదేశీ పర్యటన ఏప్రిల్‌ 13 న మారిషస్‌ తో ప్రారంభం అవుతుంది. 18వ తేదీన బ్రిటన్‌ పర్యటనతో ముగియనుంది. కేటీఆర్‌ తో అధికారుల బృందం కూడా పర్యటించనుంది. ఏప్రిల్‌ 13, 14 తేదీల్లో 2 రోజులపాటు మారిషస్‌ లో జరిగే ఆయుష్‌ సదస్సులో కేటీఆర్‌ బృందం పాల్గొంటుంది. ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌ ను మారిషస్‌ లో అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వం మన సహకారం కోరుతోంది. దీంట్లో భాగంగా ఆయుష్‌ సెంటర్ల ఏర్పాటు, ఆయుర్వేద, ¬మియో, నాచురోపతి, యునానీ లాంటి భారత వైద్య, విద్యా విధానాల్లో మన సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది. తద్వారా సంబంధిత రంగాల్లో అక్కడ ఆసుపత్రులు, కాలేజీల ఏర్పాటుకు మన ప్రభుత్వం సహకారం అందించనుంది. అంతకు ముందు ఐటీ రంగంలో పెట్టుబడులపై కూడా మంత్రి కేటీఆర్‌ మారిషస్‌ లోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆ తర్వాత 4 రోజుల పాటు మంత్రి కేటీఆర్‌ బృందం బ్రిటన్‌ లో పర్యటిస్తుంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడంపై మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించనున్నారు. ఐటీ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, టీ హబ్‌ సీఈఓ మంత్రితోపాటు యునైటెడ్‌ కింగ్డమ్‌ వెళ్లనున్నారు.బ్రిటన్‌ లో ఐటీ సహా ఇతర రంగాల కంపెనీల నుంచి పెట్టుబడులు ఆహ్వానించే దిశగా మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు 2 దేశాల నుంచీ తనకు ఆహ్వానాలు కూడా అందాయని కేటీఆర్‌.. సీఎస్‌ రాజీవ్‌ శర్మకు లేఖ రాశారు. పర్యటనకు అవసరమయ్యే అనుమతుల పక్రియను సాధారణ పరిపాలన శాఖ అధికారులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ టూర్‌ కు విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తిని పంపింది. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి అనుమతి లభించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల 4 వ తేదీన రాష్టాన్రికి కొత్త ఐటీ పాలసీని ప్రకటించబోతోంది. రాజధానిలో హెచ్‌ఐసిసీ వేదికగా ఐటీరంగ ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కొత్త విధానాన్ని ఆవిష్కరిస్తారు. ఏప్రిల్‌ 13న విదేశాల్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌.. ఈ ఐటీ పాలసీ గురించి అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణకు కృషి చేయనున్నారు.