మానవత్వాన్ని చాటుకున్న హరీశ్
వలస కూలీ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి
హైదరాబాద్ సెప్టెంబర్4(జనంసాక్షి):
పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ కు వచ్చిన పాలమూరు వలస కూలీ చాందిని షఫీ విషాద గాధ మంత్రి హరీష్ రావుని కదిలించింది. భార్యను కోల్పోయిన షఫీకి ఆయన అండగా నిలిచారు. అతన్ని ఆదు కోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను హరీష్ రావు ఆదేశించారు. షఫీ స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూరుకు వెళ్లిన అధికారులు.. అతని పరిస్థితిపై మంత్రికి నివేదిక ఇచ్చారు. నివేదిక చూసిన హరీష్ రావు షఫి పరిస్థితిపై చలించిపోయారు. అతనికి నారా యణపేట మార్కెట్ యార్డులో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇవ్వా లని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.ఊట్కూరులోని సర్దార్ నగర్ వీధికి చెందిన షఫి.. బతుకు దెరువు కోసం తన భార్య, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ పాతబస్తీకి వలస వచ్చాడు. కాటేదాన్ లోని పారిశ్రామిక వాడలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే రోజు గడిచేది. ఈ క్రమంలో ఈ నెల 2న షఫీ భార్య నుస్రత్ బేగం హైదరాబాద్ ప్ర భుత్వ ఆస్పత్రిలో మూడో బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది.పనికి వెళ్లిన షఫి సాయంత్రం తిరిగి వచ్చేసరికి భార్య పురిటి నొప్పులతో ఆస్పత్రికి పోయిందని చెప్పారు. చేతిలో ఉన్న 200 రూపాయలతో షఫి.. భార్య మృతదేహాన్ని, తన పిల్లలను తీసుకొని సొంతూరికి బయలుదేరాడు. ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు మహబూబ్ నగర్ బస్టాం డుకు చేరుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఓ వైపు భార్య మృత దేహం, మరోవైపు ఆకలితో రోధిస్తున్న పసిగుడ్డు, పక్కన ఇద్దరు పస ికూనలు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బస్టాండులో బేలచూపులు చూస్తున్న షఫీని ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు ఆదుకున్నారు. తలో కొంత చందాలు వేసుకుని అప్పటికప్పుడు రూ. 10 వేలు జమచేసి షఫీకి ఇచ్చారు. మృతదేహాన్ని
స్వగ్రామానికి ఆటోలో తరలించే ఏర్పాట్లు చేశారు. శిశువును పోలీసులు తీసుకెళ్లి జిల్లా కేంద్ర దవాఖానలో చేర్పించారు. తర్వాత ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. స్వగ్రామం ఊట్కూరులో నుస్రత్ బేగం అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తిచేశారు.