మానేరు తీరం విషాదం

5

ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారుల మృతి

కరీంనగర్‌ ,మే25(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా కట్టారామ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎల్‌ఎండీ జలాశయంలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఈతకోసమని వెళ్లిన వీరు అందులో మునిగి చనిపోయారు. జలాశయం నుంచి ఐదు మృతదేహాలను వెలికితీయగా… మరో మృతిదేహం కోసం గాలిస్తున్నారు. మృతులను సాయిసృజన, గోపి, ప్రద్యుమ్న, సౌమిత్‌, సుమిత్‌, శివసాయిగా గుర్తించారు. వీరిలో సౌమిత్‌, సుమిత్‌ కవల పిల్లలు. వీరంతా 14 ఏళ్లలోపు వారే. పిల్లలంతా ఆడుకునేందుకు వెళ్లి జలాశయంలో మునిగిపోయినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని పద్మానగర్‌ వద్ద మానేరు డ్యాంలో ఈతకోసం వీరు వెళ్లారని సమాచారం. ఈత రాకపోవడంతో మునిగి ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఉదయాన్నే క్రికెట్‌ ఆడటానికి వెళ్లి అనంతరం స్నానం చేయడానికి పక్కనే ఉన్న మానేరు డ్యాంలోకి దిగారు. ప్రమాదవశాత్తూ ఒకరి వెంట మరొకరు మునిగిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో సుమిత్‌, సుహిత్‌ కవలలు. చిన్నారులు చనిపోవటంతో ఆ ప్రాంతమంతా హృదయ విదారక వాతావరణం నెలకొంది. చనిపోయిన వారి మృతదేహాలన్నింటినీ వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం వెళ్లిన చిన్నారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డ్యామ్‌ వద్దకు వెళ్లారు. ఆరుగురు చిన్నారులు కనిపించకుండా పోవడంతో అక్కడే ఉన్న మరో చిన్నారి షాక్‌గురయ్యాడు. అనుమానం వచ్చిన స్థానికులు, తల్లిదండ్రులు చిన్నారులు ఈతకు వెళ్లి గల్లంతైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి ఆరుగురు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.  మానేరు డ్యాంలో ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతిచెందిన విషాద సంఘటనపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో తీవ్ర కలత చెందానని సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయంలో పిల్లల తల్లిదండ్రులు అప్పమత్తంగా

ఉండాలని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.