మామూలు ఈవ్‌టీజింగట!

– బనారస్‌ యూనివర్సిటీ వీసీ త్రిపాఠి

వారణాసి,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో హింసాత్మక ఘటనలపై వైస్‌ ఛాన్స్‌లర్‌ త్రిపాఠి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు విద్యార్థినులపై లాఠీ ఛార్జ్‌ చేస్తే అది సింపుల్‌ ఈవ్‌టీజింగ్‌ ఘటనని దీనిని రాజకీయం చేస్తున్నారని అన్నారు. మోదీ వారణాసికి వస్తున్నారని తెలిసే కావాలని ఇలాంటి ఘర్షణలను సృష్టించారని పేర్కొన్నారు. విద్యార్థినులపై లాఠీఛార్జ్‌ చేయడం హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ విషయంలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రధాని మోదీ వచ్చే ఒక్క రోజు ముందు కావాలనే ఈ ఆందోళనకు దిగారని ఆరోపించారు. ఈ ఆందోళనలకు పాల్పడిన విద్యార్థినులపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయడం మరింత దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓ పోలీస్‌ ఓ విద్యార్థిని నేలపైకి నెట్టేయగా.. మిగతా పోలీసులు ఆమెను లాఠీలతో కొడుతున్న వీడియో విద్యార్థుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఇంత గొడవ జరిగితే వీసీ దానిని తేలిగ్గా తీసుకోవడం స్టూడెంట్స్‌కు మింగుడు పడటం లేదు. ఈ ఘటనపై మోదీ, అమిత్‌ షా కూడా స్పందించారు. యూపీ సీఎం యోగితో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కూడా జరుగుతున్నది. ఈవ్‌ టీజింగ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోని వీసీ త్రిపాఠి.. ఇప్పుడు చిన్న ఘటనపై ఇంత ఆందోళన చేస్తారా అంటూ ప్రశ్నించడం గమనార్హం. ఇది వేధింపుల కేసు కాదు.. కేవలం ఈవ్‌ టీజింగ్‌. అయినా వాళ్లు కావాలని ఆందోళన చేపట్టారు అని త్రిపాఠి అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. మోదీ బీహెచ్‌యూ విద్యార్థినులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అయితే ఈ గొడవ పొలిటికల్‌ టర్న్‌ తీసుకోవడంపై వీసీ త్రిపాఠి ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్సిటీని రాజకీయాలకు వాడుకోవడం సరికాదు. నేను ఇప్పటికే ఆ విద్యార్థినితో మాట్లాడాను. ఆమె కూడా ఈ ఆందోళనలను తప్పుబట్టింది. అనవసరంగా రాజకీయం చేశారంటూ ఆమె ఆరోపించింది అని త్రిపాఠి చెప్పారు. ఢిల్లీలోని జేఎన్‌యూ, డీయూలాగా బీహెచ్‌యూలో కూడా చదువులకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు.యువతులపైలాఠీ ఛార్జ్‌ చేసిన ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.